తొలి భారత మహిళా పైలట్‌ జయంతి.. గూగుల్ ప్రత్యేక డూడుల్

by  |
google doodle
X

దిశ, ఫీచర్స్ : 21 సంవత్సరాల వయస్సులో సంప్రదాయ చీరను ధరించి ఆమె తన మొదటి సోలో ఫ్లైట్ కోసం ఒక చిన్న డబుల్-వింగ్డ్ విమానం కాక్‌పిట్‌లోకి అడుగుపెట్టింది. క్రాఫ్ట్‌ను ఆకాశమార్గంలో నడిపించి చరిత్ర సృష్టించింది పైలట్ సరళా తుక్రాల్. భారతదేశ తొలి ఉమెన్ పైలట్‌‌గా నిలిచి, ఎంతోమంది అటువైపుగా అడుగులు వేయడానికి ప్రేరణగా నిలిచింది. ఆదివారం సరళ 107 జన్మదినోత్సవం సందర్భంగా గూగుల్ తమ హోమ్‌పేజీలో ప్రత్యేక డూడుల్‌తో ఆమెకు నివాళి అర్పించింది.

1914లో బ్రిటీష్ ఇండియా ఢిల్లీలో జన్మించిన సరళా తుక్రాల్, పాకిస్థాన్‌లోని లాహోర్‌లో నివాసముంటోంది. అక్కడ ఆమె భర్త విమానాయానం చేయడంతో స్ఫూర్తి పొంది తాను శిక్షణ తీసుకుంది. లాహోర్ ఫ్లయింగ్ క్లబ్ విద్యార్థిగా, ఆమె A లైసెన్స్ పొందడానికి 1,000 గంటల విమాన ప్రయాణాన్ని పూర్తి చేసింది. 21సంవత్సరాల వయసులో సోలో డబుల్ వింగ్డ్ విమానం నడిపించి, ఆ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళలగా ఆమె చరిత్ర సృష్టించింది. దాంతో ఆకాశం ఇక పురుషులది మాత్రమే కాదనే సంకేతాన్ని యావత్ భారతావణికి అందించింది. సరళ విజయం ఎంతోమందికి స్ఫూర్తినివ్వగా, ఆ తర్వాత చాలామంది మహిళలు విమానం నడపడంలో శిక్షణ పొందేందుకు ముందుకు వచ్చారు. వాణిజ్య పైలట్ కావడానికి సరళ తన ప్రయత్నాలు మొదలుపెట్టగా, రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఆ పని పూర్తిచేయలేకపోయింది.

‘గత సంవత్సరం తుక్రాల్‌ జయంతి సందర్భంగా ఆమెను గౌరవార్థం ప్రత్యేక డూడుల్‌ని రూపొందించాలనుకున్నాం. కేరళలో విషాద విమాన ప్రమాదం సంభవించడంతో డూడుల్ నిలిపివేశాం. కానీ ఈ సారి మాత్రం ఆమెకు స్పెషల్ డూడుల్ అంకితం చేశాం. మహిళా పైలట్ల కోసం శాశ్వత వారసత్వాన్ని ఆమె వదలిపెట్టింది’ అని గూగుల్ తెలిపింది.



Next Story