బహుముఖ సామాజిక శాస్ర్తవేత్త 

by  |
బహుముఖ సామాజిక శాస్ర్తవేత్త 
X

దిశ, అభిప్రాయం : రెండు పరస్పర విరుద్ధ సామాజిక రూపాలకు భారతదేశంలో బ్రాహ్మణవాదం, బౌద్ధం రూపకల్పన చేశాయి.బ్రాహ్మణవాదం నెలకొల్పిన అసమానత్వాన్ని ధిక్కరించి సమతాభావనను సమాజంలో నెలకొల్పడానికి అంటే గతాన్ని విడనాడే ఒక సంఘటిత శక్తిని బౌద్ధం అందించిందనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే, ఆ బౌద్ధ సాహిత్యాన్ని ప్రజా బహుళ్యంలోకి తీసుకొచ్చి, బౌద్ధిజంపై విస్తృతమైన సాహిత్య అవగాహన కల్పించారు. బుద్ధఘోషుడుగా ప్రసిద్ధికెక్కిన అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి. ఎంతోమంది మస్తిష్కంలో విజ్ఞాన వెలుగురేఖలు ప్రసరింపజేశారు. మతం కంటే మనిషికి మనోవిజ్ఞానమే మనుగడను అందిస్తుందని బలంగా నమ్మిన బుద్ధఘోషుడు ఎంతో పరిశ్రమ చేశారు. మనోవిజ్ఞాన, సామాజిక, భాషా శాస్త్రవేత్తగా, సంస్కృతి విశ్లేషకునిగా, బౌద్ధ తత్వవేత్తగా, సాహిత్య విమర్శకునిగా, అనువాదకునిగా బహుముఖ సామాజిక సేవ చేశారు. మిసిమి పత్రికా సంపాదకునిగా పనిచేసిన అన్నపరెడ్డిలో తాత్త్విక ఆలోచనాపరుడు..

అంతరదృష్టి కలిగిన పండితుడు. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన సిగ్మండ్ ఫ్రాయిడ్ ను తెలుగు ప్రజలకు పరిచయం చేసి ఆంధ్రా ఫ్రాయిడ్ గా వినుతికెక్కారు. స్వప్న సందేశం, కలలకు అర్థం చెప్పడం ఎలా?, నాగరికత దాని అపశృతులు, మనసు-మర్మం, మనసు గతినే మార్చిన ఫ్రాయిడ్‌, అస్తిత్వవాదంతోపాటు పారాయణ వర్గ, ఆచార్య నాగార్జునుడు, మానవీయ బుద్ధ, నేనొక ప్రవాహం, నిత్యజీవితంలో సజీవ ధ్యానం వంటి ఎన్నో పుస్తకాలు రచించారు. గొప్ప సాహిత్యాన్ని అందించిన అన్నపురెడ్డి చదువు వింతగ ప్రారంభమైంది. కనీసం అక్షరాలు దిద్దేందుకు పలక కూడాలేని పరిస్థితి.తన స్నేహితుడి విరిగిన పలకతో బుద్ధఘోషుడి విద్యాభ్యాసం ప్రారంభమైంది. ఏడేళ్లకు బడికిపోతే, దానికంటే ముందే నాలుగేళ్ల వయసులోనే పశువుల కాపరిగా పనిచేశారు. ఆయన బాల్యమంతా ఒడిదొడుకుల మయమే. ఆయన ఒంటరి తల్లి కొడుకు, గుంటూరు జిల్లా తెనాలిలోని తూములూరులో అన్నపరెడ్డి 1933, ఫిబ్రవరి 22న గోవిందమ్మ, అప్పిరెడ్డి దంపతులకు జన్మించారు. అన్నపరెడ్డి ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే అతని తల్లిని ఆత్మకూరులో ఉన్న తన ఇంటి నుంచి తండ్రి వెళ్లగొట్టాడు. దీంతో బాల్యం మరింత పేదరికంలోకి పడిపోయింది. దీనికి తోడు వివక్ష కూడా అన్నపరెడ్డిని అవహేళన చేసింది.పాఠశాల ఉపాధ్యాయుడు కొడుకు ఒకరోజు బడికి రాకపోతే “ మా ఇంటికి పోయి మా కొడుకును బడికి తీసుకురాపోరా” అని మాస్టారు ఇంటికి పంపుతాడు.

అయితే, ఇంటి వరండాలో భోజనం చేస్తుండగా అన్నపురెడ్డి వెళ్తాడు. ఈయన్ను చూసిన బసవయ్య భార్య వారి కంచాల్లో ఉన్న అన్నాన్ని బయట పారవేస్తుంది.“బ్రాహ్మణులు భోజనం చేస్తుంటే..శూద్రులు రాకూడదని తెలియదారా..? అంటూ ఎన్నో మాటలు అని అవమానించింది. ఈ ఘటన నుంచే బుద్ధఘోషుడిలో సమానత్వం సాధించాలనే బీజం పడిందని చెప్పవచ్చు. ఇది చిన్ననాటి నుంచే మనసులో ముద్ర పడటంతో అన్నపరెడ్డిని మనో వికాసం దిశగా నడిపించాయి. బాల్యం నుంచి వివక్ష, అసమానతలు ఎదుర్కొన్న అన్నపరెడ్డి.. సోషలిస్టు భావాలతో హేతువాదం వైపు అడుగులు వేశారు. తన జీవితాన్ని సామాజిక పరివర్తనకే అంకితం చేసిన అన్నపరెడ్డి మొత్తం 83 గ్రంథాలు రచించారు. దాదాపు చాలా పుస్తకాలు పదుల సంఖ్యలో పునర్ముద్రణలు పొందాయి. ఈయన సాహిత్యం చాలా యూనివర్సిటీల్లో పాఠ్యగ్రంథాలుగా, రిఫరెన్స్‌ గ్రంథాలుగా ఉన్నాయి. మిత్రుల ఒత్తిడితో అన్నపరెడ్డి తన స్వీయ చరిత్రని ‘అనాత్మవాది ఆత్మకథ (అలాతచక్ర)’ పేరుతో రాసుకున్నారు. తన జీవితాన్ని బౌద్ధాచరణలో గడిపిన బుద్ధఘోషుడు గొప్ప సాహిత్యాన్ని సమాజానికి అందించారు. బౌద్ధమే భారతదేశ సమతా భావానికి ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటారు. ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన అందించిన సాహిత్యం, విజ్ఞానం రూపంలో నిత్యం మన జీవితాల్లో ఎల్లకాలం వెలుగుతూనే ఉంటారు.

-సయ్యద్ ఇస్మాయిల్ ,
తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు


Next Story