ఆండ్రాయిడ్ 11కు మళ్లీ స్వీట్ పేరు?

by  |
ఆండ్రాయిడ్ 11కు మళ్లీ స్వీట్ పేరు?
X

తమ అప్‌డేటెడ్ ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్లకు తియ్యని పదార్థాల పేర్లు పెట్టడాన్ని గూగుల్ ఆనవాయితీగా పాటిస్తోంది. అయితే గత వెర్షన్ ఆండ్రాయిడ్ 10కు మాత్రం ఎలాంటి పేరు పెట్టకుండా ఆ ఆనవాయితీకి స్వస్తి పలికింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌కు తీపి పదార్థం పేరు పెట్టి ఆనవాయితీని మళ్లీ కొనసాగించే యోచనలో గూగుల్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే త్వరలో రాబోతున్న ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌కు ‘రెడ్ వెల్వెట్ కేక్’ అని పేరు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ పేరును ఇప్పటికే గూగుల్‌ కార్యాలయంలో ఆర్‌వీసీగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆల్ అబౌట్ ఆండ్రాయిడ్’ అనే పాడ్‌కాస్ట్‌లో ఆండ్రాయిడ్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ డేవ్ బర్క్ మాట్లాడుతూ ఈ విషయాన్ని చూచాయగా వెల్లడించారు.

ఏప్రిల్ 2009లో మొదటిసారిగా ఆండ్రాయిడ్ 1.5 వెర్షన్‌కు కప్‌కేక్ అని పేరు పెట్టి ఈ ఆనవాయితీని గూగుల్ ప్రారంభించింది. అప్పటి నుంచి 1.6కు డోనట్ అని, 2.0కు ఎక్లెయిర్ అని, 2.2కు ఫ్రోయో అని, 2.3కు జింజర్‌బ్రెడ్ అని పేర్లు పెట్టింది. అలాగే ఆండ్రాయిడ్ 3.0 హనీకోంబ్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్‌విచ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్‌లను కూడా విడుదల చేసింది. ఇక తర్వాత వెర్షన్‌లకు మార్ష్‌మ్యాలో, నౌగట్, ఓరియో, పై అని పేర్లు పెట్టింది. కానీ ఆండ్రాయిడ్ 10 వెర్షన్‌కు మాత్రం ఎలాంటి పేరు పెట్టకుండా నేరుగా విడుదల చేసింది. ఇప్పటివరకు సీ నుంచి పీ వరకు ఆంగ్ల ఆల్ఫాబెట్‌ల ఆర్డర్‌లో గూగుల్ పేర్లు పెట్టింది. బహుశా క్యూ అక్షరంతో ఎలాంటి మంచి తీపి పదార్థం దొరకక 10వ వెర్షన్‌కు పేరు పెట్టలేదని అప్పట్లో అనధికారిక వివరణలు వచ్చాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ 11కు ఆర్ అక్షరం పేరు పెట్టబోతుండటం వల్ల ఆ వివరణలు నిజమేనేమోనన్న అనుమానం కలుగుతోంది.


Next Story

Most Viewed