కూటమి పాలనలో పొదుపు సంఘాల ఆర్థిక సంక్షోభం: వైఎస్ జగన్

by Malleboina Mahesh |   (  Updated:2026-06-25 08:24:08  IST  )

కూటమి పాలనలో పొదుపు సంఘాలకు వడ్డీ రాయితీ సున్నా.. రెండేళ్లలో మహిళలకు రూ. 6,000 కోట్ల దగా జరిగిందంటూ వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు!

కూటమి పాలనలో పొదుపు సంఘాల ఆర్థిక సంక్షోభం: వైఎస్ జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) కూటమి ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. కూటమి పాలనలో పొదుపు సంఘాల ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆరోపిస్తూ.. ఎక్స్ వేధికగా విమర్శల వర్షం కురిపించారు. ఆయన ట్వీట్‌లో " పొదుపు సంఘాల (SHG) మహిళల రుణాల వడ్డీ లేని రాయితీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం దారుణంగా వంచించిందని ఆరోపించారు. తమ ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో కేవలం వడ్డీ రాయితీ కిందనే ఏకంగా రూ. 4,969 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశామని, ‘ఆసరా’, ‘చేయూత’ వంటి పథకాలతో కొండంత అండగా నిలిచామని గుర్తు చేశారు.

కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2024-25 మరియు 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో వడ్డీ రాయితీ కింద విడుదల చేసిన నిధులు ‘సున్నా’ అని మండిపడ్డారు. కూటమి ఇచ్చిన హామీ ప్రకారం లెక్కిస్తే ఈ రెండేళ్ల కాలంలో డ్వాక్రా మహిళలు ఏకంగా రూ. 6,000 కోట్ల ప్రయోజనాన్ని కోల్పోయి మోసపోయారని ఆయన గణాంకాలతో వివరించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక మద్దతు లభించకపోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి పొదుపు సంఘాల రుణ వృద్ధిరేటు దారుణంగా పడిపోయిందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

తమ హయాంలో 2023-24 నాటికి రూ. 49,696 కోట్లుగా ఉన్న ఎస్‌హెచ్‌జీల రుణ వితరణ.. కూటమి నిర్లక్ష్యం వల్ల 2024-25 నాటికి రూ. 41,623 కోట్లకు, 2025-26 నాటికి రూ. 41,105 కోట్లకు తగ్గిపోయిందని స్పష్టం చేశారు. గ్రామీణ మహిళల చేతుల్లో డబ్బులు లేకపోవడంతో మార్కెట్‌లో కొనుగోలు శక్తి క్షీణించిందని, దీనికి ప్రత్యక్ష నిదర్శనమే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాబడి వృద్ధి రేటు మైనస్ 3.22% (-3.22%) కి పడిపోవడమే అని విశ్లేషించారు. కూటమి అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్రం తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోతోందని జగన్ ట్విట్టర్ (X) వేదికగా విమర్శించారు.

Next Story