ఏపీ అసెంబ్లీలో జీరో అవర్ రద్దు.. లడ్డూ కల్తీపై సుదీర్ఘ చర్చకు నిర్ణయం

by Naga Rani Yarlagadda |

ఏపీ అసెంబ్లీలో రేపు జీరో అవర్ ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లడ్డూ కల్తీపై 4 గంటలపాటు చర్చించాలని నిర్ణయించింది.

ఏపీ అసెంబ్లీలో జీరో అవర్ రద్దు.. లడ్డూ కల్తీపై సుదీర్ఘ చర్చకు నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై చర్చించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీ విషయంపై చర్చించేందుకు రేపు అసెంబ్లీలో సుదీర్ఘ సమయం కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం రేపు (మంగళవారం) ప్రశ్నోత్తరాల తర్వాత జీరో అవర్ ను రద్దు చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయించింది. ఈ అంశంపై టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు స్వల్ప అస్వస్థత కారణంగా సభకు హాజరు కాలేదు. రేపు సభకు వస్తే.. ఆయన కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కల్తీ నెయ్యిపై ప్రకటన చేస్తారు. కాగా.. టీటీడీలో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా నిర్ణయించారు. అన్యమతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

దేవుడి ఫొటోలపై మంత్రుల మండిపాటు

మండలిలోకి దేవుడి ఫొటోలను తీసుకురావడం మహాపరాధమని కూటమి మంత్రులు మండిపడ్డారు. టీడీఎల్పీలో మంత్రులు అనగాని, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి, బీసీ జనార్ధన్ రెడ్డి ఈ అంశంపై చర్చించారు. వైసీపీ చేసిన తప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, అందుకే తాము చేసింది తప్పేకాదని బుకాయిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైవీ సుబ్బారెడ్డినే లడ్డూ కల్తీ జరిగినట్లు ఒప్పుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తుచేశారు. దానిని డైవర్ట్ చేసేందుకు ధర్నా పేరిట కుంటిసాకులు చెప్తున్నారని ఆరోపించారు.

సభలో కల్తీ అంశంపై చర్చ జరిగితే అడ్డంగా బుక్కయ్యేద వైసీపీనే అని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీకి చర్చ జరిపే సత్తా లేదు కాబట్టే సభను ధర్నా పేరుతో ఆపేస్తున్నారని ఆరోపించారు. ఏమాత్రం వైసీపీ సభ్యులకు చిత్తశుద్ధి ఉన్నా సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు. అసలు వాళ్లు మండలికి ఎందుకు వస్తున్నారో వారికే అర్ధంకాని పరిస్థితి నెలకొందన్నారు.

Next Story