పరకామణి కేసులో సిట్ ముందుకు వైవీ సుబ్బారెడ్డి

by Thanuru Gopichand |

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ కేసులో (Parakamani Theft Case) విచారణ కీలక దశకు చేరుకుంది.

పరకామణి కేసులో సిట్ ముందుకు వైవీ సుబ్బారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ కేసులో (Parakamani Theft Case) విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) విజయవాడలోని కానూరు సీఐడీ కార్యాలయం వద్ద సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ముందు హాజరయ్యారు. ఈ విచారణను స్వయంగా సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ పర్యవేక్షిస్తున్నారు. ​కాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ, డిసెంబర్ 2వ తేదీలోగా పూర్తి నివేదికను న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉంది.

వాస్తవానికి ఈ కేసు విచారణ తిరుపతిలో జరగాల్సి ఉండగా, మీడియా హడావుడి దృష్ట్యా దానిని విజయవాడకు మార్చినట్లు సమాచారం. పరకామణి చోరీ కేసు, అప్పట్లో జరిగిన పరిణామాలు, లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడం వంటి కీలక అంశాలపై సీఐడీ అధికారులు సుబ్బారెడ్డిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులు, బ్యాంకు లావాదేవీల గురించి కూడా ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.

అయితే పరకామణి చోరీ గురించి తనకు తెలియదని, దొంగతనం జరిగిందని మాత్రమే చెప్పారని వైవీ సుబ్బారెడ్డి మీడియాతో పేర్కొన్న విషయం విదితమే. స్వామివారి సేవలో నీతి నిజాయితీతో పనిచేశానని, తనపై వస్తున్న ఆరోపణలు రాజకీయ దుష్ప్రచారంలో భాగమేనని ఆయన కొట్టిపారేశారు.

కానూరు వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన

​సుబ్బారెడ్డి విచారణకు హాజరైన సందర్భంగా కానూరు సీఐడీ కార్యాలయం వద్దకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) శ్రేణులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తమ నేతకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

డిసెంబర్ 2న కోర్టుకు నివేదిక

​హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి చోరీ కేసులో దర్యాప్తు పూర్తి చేసి డిసెంబర్ 2న కోర్టుకు నివేదిక సమర్పించడానికి సీఐడీ అధికారులు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఈ నివేదికలో సీఐడీ ఎలాంటి కీలక అంశాలను పొందుపరుస్తుందనేది రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. అయితే వైవీ సుబ్బారెడ్డి కంటే ముందే మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలను కూడా సీఐడీ విచారించిన సంగతి విదితమే.

Next Story