YSRCP: రాజ్యస‌భ‌లో త‌గ్గిన వైసీపీ బ‌లం

by Ramesh Goud |

రాజ్య‌స‌భ ఎంపీ సీటుకు రాజీనామా చేస్తాన‌ని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌క‌టించ‌డంతో ఆ పార్టీ బ‌లం రాజ్య‌స‌భ‌లో దారుణంగా ప‌డిపోనుంది.

YSRCP: రాజ్యస‌భ‌లో త‌గ్గిన వైసీపీ బ‌లం
X

దిశ‌, ఏపీబ్యూరో: రాజ్య‌స‌భ ఎంపీ సీటుకు రాజీనామా చేస్తాన‌ని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌క‌టించ‌డంతో ఆ పార్టీ బ‌లం రాజ్య‌స‌భ‌లో దారుణంగా ప‌డిపోనుంది. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఘోర‌ప‌రాజ‌యం పాలైంది. 2019 ఎన్నిక‌ల్లో 151 సీట్ల‌తో రికార్డు స్థాయి విజ‌యం న‌మోదు చేసిన ఫ్యాన్ పార్టీ 2024 ఎన్నిక‌ల్లో కేవ‌లం 11 సీట్ల‌ను మాత్ర‌మే ద‌క్కించు కుంది. అనూహ్య ఫ‌లితాల‌తో వైసీపీ అధినేత‌తో స‌హా పార్టీ వ‌ర్గాలు కంగుతిన్నాయి.

ఓటమి నాటి నుంచి వలసలు..

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత వైసీపీ నుంచి ప‌క్క పార్టీల్లోకి భారీ స్థాయిలో వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస‌రెడ్డి, ఆళ్ల నాని వంటి వారితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు వైఎస్ జ‌గ‌న్‌కు, పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్య‌స‌భ ఎంపీలు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు. మాజీమంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద‌మ‌స్తాన్‌రావు, ఆర్ కృష్ణ‌య్య‌లు ఇప్ప‌టికే వారి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల‌కు రాజీనామా చేసి తెలుగుదేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీల్లో చేరారు. తాజాగా విజ‌య‌సాయిరెడ్డి కూడా రాజీనామా ప్ర‌క‌ట‌న‌తో రాజ్య‌స‌భ‌లో వైసీపీ బ‌లం 11 నుండి 7కు ప‌డిపోనుంది.

అధినేతతో పొసగడం లేదా..?

విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా పార్టీలో హ‌ఠాత్ ప‌రిణామం కాద‌ని, గ‌త కొద్దికాలంగా పార్టీ అధినేత‌కు, విజ‌య‌సాయిరెడ్డికీ మ‌ధ్య బొత్తిగా పొస‌గ‌డం లేద‌ని స‌మాచారం. దీంతో, విజ‌య‌సాయిరెడ్డి త‌న‌పై ఉన్న కేసులు మ‌రింత జ‌ఠిలం కాకుండా ఉండేందుకు రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పార‌ని అంటున్నారు. రాజ‌కీయాల నుండి వైదొలిగేట‌ప్పుడు అంద‌రితోనూ మంచిగా ఉండాల‌న్న కోరిక‌తోనే చంద్ర‌బాబు ఫ్యామిలీతో వైరం లేదు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంచి స్నేహితుడు, ప్ర‌ధాని మోడీ, అమిత్‌షా అండ‌దండ‌గా నిల‌బ‌డ్డార‌ని డిఫెన్సింగ్ ట్వీట్ చేశార‌ని విశ్లేషిస్తున్నారు. విజ‌య‌సాయి రాజీనామాతో వైఎస్ జ‌గ‌న్ డీలా ప‌డ‌టం ఖాయ‌మ‌ని, కేంద్రంలో కీల‌కంగా ఉండి ప‌నులు చ‌క్క బెట్టే వ్య‌క్తిని జ‌గ‌న్ దూరం చేసుకున్నార‌ని కొంత‌మంది అభిప్రాయ ప‌డుతున్నారు. అయితే, జ‌గ‌న్ వెంట ఎవ‌రున్నా, లేక పోయినా ఆయ‌న రాజ‌కీయ ల‌క్ష్యాన్ని దెబ్బ‌తీయ‌డం, ఆయ‌న‌ను రాజ‌కీయాల నుండి దూరం చేయ‌డం ఎవ‌రికీ సాధ్యం కాద‌ని మ‌రి కొంత‌మంది విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఫారిన్ టూర్ లో ఉన్న వైఎస్ జ‌గ‌న్ తిరిగి ఇండియాకు వ‌చ్చిన త‌ర్వాత విజ‌య‌సాయి రాజీనామాపై ఏవిధంగా స్పందించ‌నున్నారో వేచి చూడాల్సి ఉంది.

Next Story