మామిడి రైతులకు అన్యాయం.. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా ? : జగన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-09 09:36:09  IST  )

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.

మామిడి రైతులకు అన్యాయం.. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా ? : జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును (Bangaru Palyam Market Yard) సందర్శించి, మామిడి రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఆగం చేసిందని ఆరోపించారు. రైతుల్ని రౌడీషీటర్లతో పోల్చుతారా? రైతులపై రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో మాట్లాడేందుకు కేవలం 500 మంది మాత్రమే రావాలని ఆంక్షలు పెట్టడమేంటని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవితాలను నాశనం చేసేందుకు కుట్ర చేస్తోందని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. ఇప్పటి వరకూ రైతులకు పెట్టుబడి సహాయం, ఇన్ పుట్ సబ్సిడీ అందలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతన్నను ఆర్బీకేలు చేయిపట్టి నడిపించాయన్న జగన్.. ఇప్పుడు రాష్ట్రంలో మామిడికి కనీసం రూ.12 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కర్ణాటకలో కేంద్రం మామిడి కొనుగోలు చేస్తుంటే.. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా ? అని తీవ్ర విమర్శలు చేశారు. గిట్టుబాటు ధర లేక పండించిన మామిడిని రోడ్లపై పోసి ట్రాక్టర్లతో తొక్కించేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story