‘ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి’ భర్త సూచనలు.. కళ్లెదుటే భార్య ఆత్మహత్య..

by Ramesh Naini |

క్షణికావేశంలో భార్య ఉరితాడుకు వేలాడుతుంటే.. ఆ కన్నెర్ర చేసిన భర్త కాపాడాల్సిన బాధ్యతను మరచిపోయాడు. పైగా 'ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి' అంటూ సూచనలు చేస్తూ తన మొబైల్ ఫోన్‌లో వీడియో చిత్రీకరించిన ఘటన కడప జిల్లా రాజంపేటలో తీవ్ర కలకలం రేపింది.

‘ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి’ భర్త సూచనలు.. కళ్లెదుటే భార్య ఆత్మహత్య..
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్షణికావేశంలో భార్య ఉరితాడుకు వేలాడుతుంటే.. ఆ కన్నెర్ర చేసిన భర్త కాపాడాల్సిన బాధ్యతను మరచిపోయాడు. పైగా 'ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి' అంటూ సూచనలు చేస్తూ తన మొబైల్ ఫోన్‌లో వీడియో చిత్రీకరించిన ఘటన కడప జిల్లా రాజంపేటలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రాజంపేట మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ రైల్వేలో లోకో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి కృష్ణవేణితో వివాహమైంది. కొంతకాలంగా ఈ దంపతుల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. తరచూ గొడవ పడటం, ఆ తర్వాత కలిసిపోవడం వాళ్లకి పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం కూడా దంపతుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.

వీడియో తీస్తూ.. ఉరి ఎలా వేసుకోవాలో చెబుతూ..

కుటుంబ సభ్యుల ప్రకారం.. భర్తతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు సిద్ధపడింది. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న భర్త శ్రీనివాస్ ఆమెను అడ్డుకునే కనీస ప్రయత్నం చేయలేదు. పైగా విచక్షణ కోల్పోయి, ఆమె ఉరి వేసుకుంటున్న దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా, ఉరి ఎలా వేసుకోవాలో ఆమెకు సూచనలు చేయడం గమనార్హం. ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారి, అందరినీ కలచివేస్తోంది.

పోలీసుల అదుపులో నిందితుడు..

కృష్ణవేణి మృతి వార్త తెలుసుకున్న ఆమె బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. భార్య కళ్లెదుటే ప్రాణాలు విడుస్తుంటే అడ్డుకోకపోగా, వీడియో తీసిన శ్రీనివాస్‌పై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై దాడికి యత్నించగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. కృష్ణవేణి మృతికి భర్త ప్రవర్తనే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని బంధువులు పట్టుబట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకోని ఆత్మహత్యపై విచారణ చేపట్టారు.

Next Story