ఆరని విభజన చిచ్చు!

by Thanuru Gopichand |

అన్నమయ్య జిల్లా కేంద్రం తరలింపుపై రగులుతున్న రాయచోటి.

ఆరని విభజన చిచ్చు!
X

దిశ, ప్రతినిధి కడప : అన్నమయ్య జిల్లాలో విభజన చిచ్చు రగులుకుంది. ఎన్నికల హామీల విశ్వసనీయతకు, భవిష్యత్ ఎన్నికల తీర్పునకు అగ్నిపరీక్షగా తయారైంది. గత ఎన్నికల ప్రచారంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మదనపల్లికి జిల్లా హోదా, రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగింపు, రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా ఆకర్షణీయంగా కనిపించినా, అధికారంలోకి వచ్చిన తర్వాత అవే భారంగా మారాయి. ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో విధంగా నష్టపరిచేలా ఉండటంతో, ఇచ్చిన మాటలకే కట్టుబడి ఉండలేని పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని నైతిక సంక్షోభంలోకి నెట్టింది.

గెజిట్‌తో అలజడి మొదలు

మదనపల్లికి జిల్లా హోదా కల్పిస్తూ, సిద్ధవటం–ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తూ విడుదలైన గెజిట్‌తో అలజడి మొదలైంది. రాజంపేటవాసులు జిల్లా కేంద్రాన్ని తమ ప్రాంతంలోనే కోరగా, సిద్ధవటం–ఒంటిమిట్ట ప్రజలు కడప జిల్లాలోనే కొనసాగాలని రోడ్లెక్కారు. దీంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన అగత్యం ఏర్పడింది. రాజంపేటను, సిద్ధవటం–ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలో కొనసాగిస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. అదే సమయంలో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చడం ద్వారా రాయచోటివాసులు భగ్గుమన్నారు. 2002లో వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో భౌగోళిక కేంద్రంగా రాయచోటిని ఎంపిక చేశారు. ఇప్పుడు అదే ప్రాంతాన్ని పక్కన పెట్టడం ప్రజల మనసుల్లో అన్యాయ భావనను నాటింది.

కోడూరును కోల్పోయిన కడప

అన్నమయ్య జిల్లాకు జరిగిన నష్టం జిల్లా కేంద్రం మార్పుతోనే ఆగలేదు. కోడూరు నియోజకవర్గం మండలాలు తిరుపతి జిల్లాలో చేరడంతో వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మంగంపేట ముగ్గురాళ్ల గనులు, అపార ఉద్యానపంటల ప్రాంతం, కోడూరు–రాయచోటి–కడప మధ్య కోట్ల రూపాయల వ్యాపార వలయం, అన్నీ ఒక్కసారిగా ఉమ్మడి కడప జిల్లా నుంచి జారిపోయాయి. ఇది ఉమ్మడి కడప జిల్లాకు నష్టదాయక పరిణామని చెప్పాలి. ఇది కేవలం గణాంకాల నష్టం కాదు. రైతులు, వ్యాపారులు, కూలీలు, రవాణా కార్మికులు,వేలాది కుటుంబాల జీవనాధారం దెబ్బతిన్న పరిణామం.

ఆత్మరక్షణలో టీడీపీ

ఈ పరిణామాలన్నీ అధికార టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టాయి. ఎన్నికల హామీలకు, అధికార నిర్ణయాలకు మధ్య పొంతన లేకపోవడం పార్టీ విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. గతంలో వైసీపీని విమర్శించిన అదే అంశాలపై ఇప్పుడు టీడీపీనే విమర్శల మధ్య నిలబడటం రాజకీయ వ్యంగ్యంగా మారింది. రాయచోటి కేంద్రంగా ఎదిగిన మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డికి ఈ పరిణామం రాజకీయంగా శరాఘాతంగా మారే ప్రమాదం ఉంది. అన్నమయ్య జిల్లాలోని ఇతర టీడీపీ నేతలూ అసంతృప్తికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నారు.

వైసీపీకి రాజకీయ ఆయుధం

ఈ పరిస్థితిని వైసీపీ రాజకీయంగా ఆయుధంగా మలుచుకుంటోంది. ప్రజా ఉద్యమానికి మద్దతు, న్యాయపోరాటం సంకేతాలతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. రాయచోటి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి జిల్లా కేంద్రం తరలి వెళ్లిన పరిమాణాలను చాలా సీరియస్‌గా తీసుకొని వ్యవహరిస్తున్నారు. ప్రజలతో కలిసి పోరాటం చేయడంతో పాటు కోర్టు ఆశ్రయించేందుకు అవసరమైన 30 పేజీల పత్రాలను సిద్ధం చేసినట్లు సమాచారం. జిల్లా కేంద్రం మదనపల్లికి చేరిన పరిణామంతో రాంప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల మధ్యనే కాదు వైసీపీ వర్సెస్ టీడీపీల నడుమ దూమారంగా మారింది. పీలేరుకు చెందిన వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు వ్యూహంలో భాగంగా రాయచోటిని జిల్లా లేకుండా చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఈ పరిణామాలన్నింటినీ ఎదుర్కొని ప్రజలకు సమాధానం చెప్పడం కూటమి నాయకులకు అగ్నిపరీక్షగా మారింది.

Next Story