'Ycp సమైక్యరాగం వెనుక కుట్ర '

by Disha Web Desk 16 |
Ycp సమైక్యరాగం వెనుక కుట్ర
X
  • సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేనోడు రెండు రాష్ట్రాలను కలుపుతాడా?
  • స్టీల్ ప్లాంట్ శిలాఫలకాలకే పరిమితమైంది
  • ముగ్గురు సీఎంలు శంకుస్థాపన చేసిన ఫలితం శూన్యం
  • స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ పోరాడుతుంది
  • సీపీఐ పాదయాత్రలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ

దిశ, డైనమిక్ బ్యూరో: కడప స్టీల్ ప్లాంట్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి నిధుల విషయంలో సీఎం జగన్ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేయలేని వ్యక్తి రెండు రాష్ట్రాలను కలుపుతానంటూ మాయ మాటలు చెప్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ మళ్లీ సమైక్య రాగం అందుకోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు. ఎవరిని వంచించడానికి ఈ సమైక్యవాదం మాటలు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిలదీశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను జమ్మలమడుగు వద్ద ఉన్న ఉక్కు పరిశ్రమ శిలాఫలకం నుంచి సీపీఐ నారాయణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ శిలాఫలకాలకే పరిమితమైందని ఘాటు విమర్శలు చేశారు. ఏ అదానీకో, మరెవరికో అప్పగిస్తే వారైనా ఈ పరిశ్రమను పూర్తి చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించిందన్నారు. అందులో భాగంగానే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఇతర అగ్రనేతలు పాదయాత్రకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ పాదయాత్రకు టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్, ప్రజా సంఘాలు మద్దతు పలికినట్లు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్ వరకు 4 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు.

ఎక్కడవేసిన గొంగళి అక్కడన్నట్లే ఉంది : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ

కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. ముగ్గురు సీఎంలు శంకుస్థాపన చేసినా ఏం ప్రయోజనమని నిలదీశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి నిధులు విడుదల చేసి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని హితవు పలికారు. ఈ నెల 13న కడప కలెక్టరేట్ వద్ద సీపీఐ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుందని, దీనికి అన్ని పార్టీల ప్రజలు హాజరవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పిలుపునిచ్చారు.


Next Story