చంద్రబాబే కాదు.. జగన్ కూడా వెన్నుపోటు దారుడే: YS షర్మిల సంచలన ట్వీట్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో కూటమి పాలన(NDA Govt) మొదలై నేటితో ఏడాది పూర్తయింది. దీంతో ఏడాది పాలనపై ఏపీ కాంగ్రెస్(AP Congress) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబే కాదు.. జగన్ కూడా వెన్నుపోటు దారుడే: YS షర్మిల సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి పాలన(NDA Govt) మొదలై నేటితో ఏడాది పూర్తయింది. దీంతో ఏడాది పాలనపై ఏపీ కాంగ్రెస్(AP Congress) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘జూన్ 4: ఉన్మాద, అవినీతి, అరాచక పాలనకు గుణపాఠం చెప్పి, ఏడాది క్రితం ఇదే రోజు కూటమి పార్టీలకు పట్టం కడితే, ప్రజా విప్లవానికి, ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పేలా ఉంది చంద్రబాబు ఏడాది పాలన. పునర్ నిర్మాణం పేరుతో సంవత్సరం పాటు కాలయాపన చేశారు. గాడిన పెడుతున్నాం అని చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టారు. సూపర్ సిక్స్ హామీలను గాలి కొదిలేశారు. అప్పుల సాకు చూపి అభివృద్ధిని అటకెక్కించారు. నిధులు లేవని ప్రజా సంక్షేమానికి పంగనామాలు పెట్టారు. కరెంటు బిల్లుల పేరిట జనాల జేబులకు చిల్లులు పెట్టారు. విభజన హామీలకు దిక్కులేదు. ప్రత్యేక హోదా అడగలేదు. పోలవరం ఎత్తు తగ్గించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుంటే కనీసం నోరు విప్పలేదు. అన్యాయమని ప్రశ్నించలేదు.

విశాఖ స్టీల్ ప్లాంటును ఉద్ధరిస్తామని చెప్పి, 4 వేల మంది కార్మికుల ఉద్యోగాలు తొలగించారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు పలికి ముస్లింలకు తీరని అన్యాయం చేశారు. ఇవాళ ప్రజా తీర్పు దినం కాదు.. "ఆంధ్రప్రదేశ్ ప్రజా వంచన దినం". నమ్మకం పేరుతో మోడీ(Modi), చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాష్ట్ర ప్రజలను వంచించిన దినం. ఇక YCP నిర్వహించే “వెన్నుపోటు”దినానికి అర్థమే లేదు. రక్త సంబంధాన్ని అడ్డుపెట్టుకొని అవసరాలకు, పాదయాత్రలకు వాడుకొని, వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ రైట్స్, బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. ఏడాది కాలంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే, అరచేతిలో మళ్ళీ వైకుంఠం చూపిస్తుంటే, పథకాలు అమలు చేయకుండా కాకమ్మ కథలు చెప్తుంటే, ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు అసెంబ్లీకి వెళ్లకుండా, కూటమి హామీలపై గళం విప్పకుండా, ప్రతిపక్ష హోదా కావాలని, ఇంట్లో ప్రెస్ మీట్‌లు పెట్టీ మారం చేసిన వైసీపీ అధినేత జగన్(YS Jagan) కూడా వెన్నుపోటు దారుడే.

ప్రజా సమస్యల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, లిక్కర్ స్కాం ఆద్యుడు మీరే అని కూటమి దర్యాప్తు చేస్తుంటే, ఆన్ లైన్‌లో కాకుండా క్యాష్ పద్ధతిలో లిక్కర్ సొమ్ము గురించి అసెంబ్లీ సాక్షిగా విచారణకు సిద్ధం అని చెప్పే దమ్ము లేకుండా నిరసనలు చేస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లుంది’’ అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story