- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు వ్యూహమేంటి?: వైఎస్ షర్మిల
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుకు అంత ప్రేమెందుకో ప్రజలకు అర్థం కావట్లేదని ఏపీసీసీ వైఎస్ షర్మిల అన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుకు అంత ప్రేమెందుకో ప్రజలకు అర్థం కావట్లేదని ఏపీసీసీ వైఎస్ షర్మిల అన్నారు. ఇటు రాష్ట్ర మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రతిపాదన పనికిరాదని సీమ ప్రొఫెసర్లు చెబుతున్నారు. లక్ష కోట్లకు పైగా ఖర్చు తప్ప ప్రయోజనం లేదని ఇంజినీర్లు మొత్తుకుంటున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఒక్క కాంట్రాక్టర్‌కు తప్ప ఆంధ్రప్రదేశ్‌కు ఏ మాత్రం ఉపయోగపడని గుదిబండ ప్రాజెక్టు కోసం.. రాష్ట్రాన్ని, పాలనను గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ అంత ఆత్రంగా ఎందుకు తిరుగుతున్నారు? అని ఆమె ప్రశ్నించారు.
బనకచర్ల లింక్ ప్రతిపాదన పోలవరం అసలు ప్రాజెక్టుకే ఎసరు పెడుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెబుతున్నా.. సీఎం చంద్రబాబుకు ఎందుకు అర్థం కావడం లేదు? అని ఆమె నిలదీశారు. మీ సొంత ప్రయోజనాల కోసం ఏకంగా పోలవరాన్నే ముంచేద్దామని ప్లాన్ చేస్తున్నారా? అందుకే ఎత్తు తగ్గించారా? ఏ నీళ్ల కోసం బనకచర్ల లింక్ ప్రతిపాదన చేశారని గోదావరి అథారిటీ అడిగిన దానికి మీ సమాధానం ఎక్కడ? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
రాయలసీమకు హక్కుగా రావాల్సిన కృష్ణా, తుంగభద్ర నీళ్లు గురించి ఆలోచన చేయకుండా.. ముక్కు ఎక్కడంటే తలచుట్టూ తిప్పినట్లుగా గోదావరి నుంచి తెస్తామనడం ఎవరిని మోసం చేయడానికి? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నాటికి మహానేత YSR ప్రారంభించిన జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులు దాదాపు 39కి పైనే ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో TDP, YCP ప్రభుత్వాలు తట్టెడు మట్టి కూడా తియ్యలేదు అని ఆమె ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులకు సుమారు రూ.40 వేల కోట్లు వెచ్చిస్తే 50 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు, కోటి మంది జనాభాకు తాగునీరు అందుతుందని తెలిసినా.. ఇప్పటి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం బాధాకరం.
పోలవరంతో సహా జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేస్తే బనకచర్ల అవసరం లేదని తెలిసి సీఎం చంద్రబాబు అనుమతుల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారంటే ఇది అవినీతికి వ్యూహం కాకపోతే మరేమిటి? అని వైఎస్ షర్మిల నిలదీశారు. ఇక బీజేపీ దత్తపుత్రుడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. YSR కొడుకై ఉండి 5 ఏళ్లలో పోలవరంలో తట్టెడు మట్టి తీశారా ? మహానేత ఆశయ సాధకుడే అయితే పోలవరంపై ఎందుకు నిర్లక్ష్యం చేశారు? 2022 లో పోలవరం నీటి నిల్వ సామర్థ్యం 41.15 మీటర్ల కుదించిన పాపం ఆనాటి వైసీపీ ప్రభుత్వనిది కాదా? అని ప్రశ్నించారు. అంచనా వ్యయం రూ.55 వేల కోట్ల నుంచి రూ.37 వేల కోట్లకు తగ్గిస్తుంటే వేడుక చూసింది మీరు కాదా ? ప్రాజెక్టు ఎత్తు కుదింపు పాపం ముమ్మాటికి వైఎస్ జగన్‌దే అని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.
బీజేపీకి అమ్ముడుపోయి ప్రధాని మోడీ కోసం పోలవరం ప్రయోజనాలను తాకట్టు పెట్టి.. ఇప్పుడు ఎత్తు పెంచాలని మాట్లాడుతున్న మాటలు బీద ఏడుపులు తప్పా మరోటి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చివరి రాష్ట్రంగా మిగులు జలాలను వాడుకోవడం రాష్ట్ర హక్కు. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ పెండింగ్ ప్రాజెక్టులకు పక్కన పెట్టి.. మీ స్వార్థ ప్రయోజనాల కోసం అర్థంపర్థం లేని ప్రాజెక్టులు కడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు. వెంటనే బనకచర్ల ప్రయత్నాలు ఆపండి. ముందు పోలవరం సంగతి తేల్చండి. పాత DPR ప్రకారమే పోలవరాన్ని 45.7 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరిగేలా చూడండి. పెండింగ్ లో ఉన్న జలయజ్ఞం ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేయండని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.






