YS Sharmila: ఏపీ ఎంపీలు మోదీకి భజనపరులు: వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు

by Kema Shiva Kumar |

ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదాపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. పార్లమెంట్‌లో గళమెత్తిన మాణిక్కం ఠాగూర్‌కు ధన్యవాదాలు తెలుపుతూనే, ఏపీ ఎంపీల వైఖరిని ఎండగట్టారు.

YS Sharmila: ఏపీ ఎంపీలు మోదీకి భజనపరులు: వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదాపై పార్లమెంట్ వేదికగా గళమెత్తిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ (Manickam Tagore)కు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీల తీరుపై ఆమె సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.

విభజన హామీలపై చిత్తశుద్ధి ఏది?

రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్‌కు ఉన్నంత చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు లేకపోవడం సిగ్గుచేటని షర్మిల విమర్శించారు. ‘ప్రత్యేక హోదా ఏదని అడుగుతుంటే, ఇక్కడ పుట్టిన ఒక్క ఎంపీ అయినా మద్దతుగా నిలబడకపోవడం తెలుగు గడ్డ చేసుకున్న దౌర్భాగ్యం. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని మోదీ గారి కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు’ అంటూ ఆమె మండిపడ్డారు.

బీజేపీ చేతిలో కీలుబొమ్మలు.. రబ్బర్ స్టాంపులు

రాష్ట్ర ప్రయోజనాల కంటే వైసీపీ ఎంపీలకు స్వలాభమే ముఖ్యమని షర్మిల ఆరోపించారు. వారంతా ప్రధాని మోదీకి భజనపరులుగా మారారని, హక్కుల కంటే ఆయన మెప్పే వారికి మిన్న అని ఎద్దేవా చేశారు. వేర్వేరు పార్టీల పేరుతో ఉన్నా, వీరంతా బీజేపీకి బానిసలని, మోదీ చేతిలో రబ్బర్ స్టాంపులని ఆమె అభివర్ణించారు. 11 ఏళ్లు గడుస్తున్నా హోదా గురించి అడిగే దమ్ము, సత్తా ఎవరికీ లేదని నిలదీశారు. రాజధాని నిర్మాణానికి అప్పులెందుకని ప్రశ్నించే ధైర్యం 25 మంది లోక్‌సభ, 11 మంది రాజ్యసభ ఎంపీలకు లేకపోవడం రాష్ట్ర దురదృష్టమని షర్మిల కామెంట్ చేశారు. విభజన హామీలు ఏపీ ప్రజలకు ఇచ్చిన రూ.5 లక్షల కోట్ల విలువైన చెక్కు వంటిదని, దాన్ని ఎంపీలు ఎన్‌క్యాష్ చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. పోలవరం ఎత్తును 41 మీటర్లకే పరిమితం చేస్తున్నా, అమరావతికి కేంద్రం సాయం చేయకపోయినా ఎంపీలు మౌనం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని ఎంపీలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Next Story