ఈ రోజుకు 15 ఏళ్లు పూర్తి.. దేశంలోనే ఒక మార్క్‌గా నిలిచాం: వైఎస్ జగన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-12 13:09:19  IST  )

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఈ రోజుకు 15 ఏళ్లు పూర్తి అయిందని, మార్చి 12న, 2011న పుట్టిందని, దేశంలోనే ఒక మార్క్‌గా నిల్చిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు...

ఈ రోజుకు 15 ఏళ్లు పూర్తి.. దేశంలోనే ఒక మార్క్‌గా నిలిచాం: వైఎస్ జగన్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) ఆవిర్భవించి ఈ రోజుకు 15 ఏళ్లు పూర్తి అయిందని, మార్చి 12న, 2011న పుట్టిందని, దేశంలోనే ఒక మార్క్‌గా నిల్చిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుత రాష్ట్రంలోనే కాదని, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా వైసీపీ కనిపిస్తోందన్నారు. ‘‘15 సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే.. ఆ రోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులు మార్చింది. రాష్ట్రంలో దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్ధం చెబుతూ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు నేను ఒకటే చెబుతున్నాను. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనేది ఒక్క జగన్‌ది మాత్రమే కాదు. కొన్ని కోట్ల మంది వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులది. వైయస్సార్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నాను.’’ అని జగన్ తెలిపారు.

జగన్‌ అనే వాడు ఒకే ఒక్కడు

‘‘ఆరోజు జగన్‌ అనే వాడు ఒకే ఒక్కడు. కానీ, జగన్‌ ఏనాడూ భయపడలేదు. ఆరోజు కాంగ్రెస్‌ పార్టీ.. ఇక్కడ, దేశంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ, జగన్‌ ఏనాడూ భయపడలేదు. కారణం జగన్‌కు నమ్మకం ఉన్నది పైన ఉన్న దేవుడు. కింద ఉన్న మీమీద మాత్రమే అని గర్వంగా చెబుతాను. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు.. ఇద్దరూ తోడుగా ఉండి నన్ను నడిపించారు. ఈరోజు నేను చెబుతున్నాను. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు కూడా విలువలు, విశ్వసనీయతకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్‌ ఎగరేసుకుని.. అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా ఈ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పి, మరొక్కసారి మీ అందరికి కూడా వినమ్రంగా, వినయపూర్వకంగా, మీ అందరి ప్రేమాభిమానాలకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.’’ అని జగన్ వ్యాఖ్యానించారు.

Next Story