శివ భక్తులపై పోలీసుల లాఠీచార్జ్ బాధాక‌రం.. శ్రీశైలం ఘటనపై స్పందించిన వైఎస్ జగన్

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయ‌డం బాధాక‌రం అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆవేదన చెందారు.

శివ భక్తులపై పోలీసుల లాఠీచార్జ్ బాధాక‌రం.. శ్రీశైలం ఘటనపై స్పందించిన వైఎస్ జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయ‌డం బాధాక‌రం అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ఆవేదన చెందారు. నిన్న శ్రీశైలంలో జరిగిన ఘటనపై ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వ‌స్తున్నారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు’ అని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధకలిగిస్తున్నాయని ఆవేదన చెందారు. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలం కావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోందన్నారు. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందని, కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతుందని మండిపడ్డారు.

శివ మాల ధారణ చేసిన భక్తులపై లాఠీచార్జ్

శ్రీశైలం ఆలయంలో, శివ మాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడిందని జగన్ విమర్శించారు. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారని ఆరోపించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయని, తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ సీఎం చంద్రబాబు నాయుడు‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని తెలిపారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారని, దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారని చెప్పుకొచ్చారు.

టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం..

రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తర్వాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ‘2025లో ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే.. తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో 7గురు భక్తులు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవి కాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది’ అని రాసుకొచ్చారు.

పదే పదే వివాదాల్లోకి తిరుమల..

దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయని, తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని జగన్ అన్నారు. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందని విమర్శించారు. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story