- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు గారూ ఇకనైనా మేలుకోండి : బాలిక హత్యాచార ఘటనపై జగన్ ఫైర్
మదనపల్లి బాలిక హత్యాచార ఘటనపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం నీరుగట్టువారిపల్లిలో ఏడేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. దీనిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బాలికలపై వరుసగా హత్యాచారాలు జరుగుతుంటే.. చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్రపోతోందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నీరుగట్టువారిపల్లి ఘటన ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు ఆ చిన్నారిని ఎందుకు కాపాడలేకపోయారు? అని ప్రశ్నించారు.
"నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం, ఆపై హత్య.
వైయస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలోని ఏ.కంబాలదిన్నెలో మూడేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం. ఆపై హత్య.
తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం. ఆపై హత్య."
చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న బాలికలు, మహిళలపై ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయని, అయినా చర్యలు చేపట్టకుండా తేలికగా తీసుకుంటున్నారని యద్దేవా చేశారు. ఎల్లోమీడియాను వాడుకుని హడావిడి ప్రకటనలు చేయడం ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేయడం షరా మామూలైపోయిందని విమర్శించారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారు మాజీ మంత్రులు అయిన వారి ఇళ్లమీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, వారిపై హత్యాయత్నాలు చేయించడంపై మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంపై లేదని మండిపడ్డారు.
"మీ ప్రభుత్వంలో హోంమంత్రిగారు లా అండ్ ఆర్డర్‌కు బాధ్యత వహించరు. మీ కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ, అందరి శాఖల్లో వేలుపెడతాడు. ఏ మంత్రీ దేనికీ బాధ్యత వహించరు. ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు. ప్రభుత్వంలో ఉన్నవారికి ఇప్పుడు ఒకటే పని.. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారు?
మీరు సృష్టించిన పొలిటికల్ గవర్నెన్స్‌తో, రెడ్‌బుక్ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది? మీ పాలనా వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? ప్రతిరోజూ భయంతో బతకాలా?
పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే, బాధితులపైనే ఎదురుకేసులు పెట్టి, అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఒక టీడీపీ నాయకడు మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేస్తే, కేసు కట్టి, అరెస్టు చేయాల్సిన పోలీసులు, 3 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి, చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపైనే హత్యాయత్నం కేసు పెట్టి, జైళ్లకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరి ఇక రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుంది? చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి.., తక్షణం లా అండ్ ఆర్డర్‌పైన, మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించడంపైన, వారి ప్రాణాలు కాపాడడంపైన దృష్టిపెట్టండి." అని జగన్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.






