గుంటూరు నుంచి విజయవాడకు ఆరుగంటలా? : అసెంబ్లీలో చర్చ

by Naga Rani Yarlagadda |

వైఎస్ జగన్ విజయవాడ పర్యటనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతల ముసుగులో నేరాలు చేయడమేంటని ప్రశ్నించారు.

గుంటూరు నుంచి విజయవాడకు ఆరుగంటలా? : అసెంబ్లీలో చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం చాలా సున్నితమైన సమస్య అని, అందుకే దానిపై ఎక్కువగా మాట్లాడకూడదనుకున్నానని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాన చర్చ రెండోరోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు కావాలనే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వాపోయారు. తనకు తెలిసి కానీ.. తెలియకుండా కానీ వేంకటేశ్వరస్వామి విషయంలో తప్పు చేయనన్నారు. నిద్రరాకుంటే ఆ స్వామిని తలచుకోగానే వస్తుందని, రాష్ట్రంలో వేంకటేశ్వరస్వామి కొలువై ఉండటం మన అదృష్టమని పేర్కొన్నారు.

రాజకీయ నేతల ముసుగులో నేరాలా?

కూటమి పాలనలో రాష్ట్రంలో రౌడీయిజం, నక్సలిజాన్ని నిర్మూలించగలిగాం కానీ.. ప్రతిపక్షాల కుట్రలను అడ్డుకోలేకపోతున్నామన్నారు. ప్రతిపక్ష నేత రోడ్డుపైకి వస్తున్నాడంటేనే ఏం జరుగుతుందోనని భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయ నేతల ముసుగులో నేతలే నేరాలు చేస్తే ఏం చేయాలి? అని ప్రశ్నించారు. వాళ్లు ఎక్కడికి వెళ్లినా దౌర్జన్యం చేయడం, రోడ్డంతా బ్లాక్ చేయడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లేందుకు ఆరుగంటల సమయం పడుతుందా? అని ప్రశ్నించారు. ఈ ఆరుగంటలూ ప్రజలు నరకం అనుభవించాలా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై సమావేశాలు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలున్నా పట్టించుకోకపోవడం హేయమన్నారు.

ఇటీవల వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంలో ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వైసీపీ నేతలు ఎక్కడికక్కడే ర్యాలీలు, రోడ్లు బ్లాక్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని ఉద్దేశించి తాజాగా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఏపీ శాసనసభ, రేపటికి వాయిదా పడింది. రేపు మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో 2026-27 రాష్ట్రబడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

Next Story