రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్ ఉండాలి.. విజయసాయి రాజీనామాపై జగన్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్ ఉండాలి.. విజయసాయి రాజీనామాపై జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్ ఉండాలని అన్నారు. భయం, ప్రలోభాలకు లొంగి క్యారెక్టర్‌ను తగ్గించుకోవద్దని సూచించారు. విజయసాయి రెడ్డి సహా ఎవరికైనా ఇదే వర్తిస్తుందని అన్నారు. తరచూ తనను అసెంబ్లీకి రావాలని కూటమి నేతలు మాట్లాడుతున్నారు.. అసెంబ్లీకి వస్తే మాకు మాట్లాడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం మాకు కూడా ఇవ్వాలని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో కార్యకర్తల విషయంలో చాలా తప్పు చేశాను అని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ 2.O లో కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బయటకు వెళ్లారు.. ఎవరికో భయపడి నిర్ణయాలు తీసుకునే వారు రాజకీయాల్లో పనికిరారు అని హాట్ కామెంట్స్ చేశారు. 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రికార్డులు బద్దలు కొట్టాయి.. 9 నెలల్లో బడ్జెటరీ అప్పులే రూ. 80,820 కోట్లు అని అన్నారు.

అమరావతి(Amaravati) పేరు చెప్పి చేస్తున్న అప్పు రూ. 52 వేల కోట్లు, APMDC ద్వారా మరో రూ. 5 వేల కోట్లు.. 9 నెలల్లోనే ఏకంగా లక్షా 40 వేల కోట్లపైనే అప్పులు చేశారు.. ఇన్ని అప్పులు చేసినా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తాము అమలు చేసిన అమ్మఒడి, రైతు భరోసా, వసతి దీవెన, విద్యాదీవెన, చేయూత, ఆసరా, వాహనమిత్ర, నేతన్న నేస్తం, చేదోడు, లా నేస్తం వంటి పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. తన ఆస్తి, తన వారి ఆస్తులు పెంచుకోవడమే అని మండిపడ్డారు. ఇసుక వల్ల రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా లాభం రాలేదు.. ఇసుక ధర మాత్రం డబుల్ అయిందని సీరియస్ అయ్యారు.

Next Story