'Ys Jaganను, షర్మిలను కలపండి'

by Disha Web Desk 16 |
Ys Jaganను, షర్మిలను కలపండి
X
  • తెలుగు రాష్ట్రాలను తర్వాత కలుపుదువు
  • సజ్జలపై అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ కలిసి ఉండాలన్నదే వైసీపీ అభిమతమన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే సంగతి దేవుడెరుగు కానీ ఏపీలో ఉన్న వైఎస్ జగన్‌ను తెలంగాణలో ఉన్న వైఎస్ షర్మిలను కలపాలని ఆయన సూచించారు. ఆ అన్నా, చెల్లెలను కలిపి అప్పుడు రెండు రాష్ట్రాలపై వ్యాఖ్యలు చేయాలని హితవు పలికారు. కకావికలమైన వైఎస్ కుటుంబాన్నే కలపలేని తమరు రెండు రాష్ట్రాలను ఎలా కలుపుతారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. విభజన హామీలను సాధించడంలో విఫలమైన వైసీపీ దాన్ని దాటవేసేందుకు కొత్త రాగం అందుకుందని మండిపడ్డారు. కేంద్రం నుంచి విభజన హామీలను సాధించడంలో ఫెయిల్ అయి ఉమ్మడి ఏపీని స్వాగతిస్తామంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. మూడున్నరేళ్లలో వైసీపీ పాలన అంతా గందరగోళంగా ఉందని, ప్రజలను ఆదుకోవడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజలు విసుగెత్తి ఉన్నారని, దాన్ని డైవర్ట్ చేసేందుకే వైసీపీ ప్రభుత్వం మళ్లీ విభజన సెంటిమెంట్‌ను రాజేస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రానికి చెందిన వేల కోట్ల ఆస్తులను తెలంగాణకు ధారదత్తం చేశారని మండిపడ్డారు. ఆర్టికల్ 3 ద్వారా కేంద్రం విభజన నిర్ణయం తీసుకోవచ్చని అప్పట్లో సలహా ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్, సజ్జల మర్చిపోయారా అని పోతుల బాలకోటయ్య ప్రశ్నించారు.


Next Story