బీర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన యువకులు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-18 04:06:14  IST  )

మద్యానికి బలైన రెండు నిండు ప్రాణాలు.

బీర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన యువకులు
X

దిశ, వెబ్ డెస్క్ : బీర్లు తాగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జిల్లాలోని కెవిపల్లి మండలం పరిధిలో ఉన్న బండ వడ్డీపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. శనివారం సాయంత్రం ఆరుగురు యువకులు ఒక చోట చేరారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మద్యం సేవించారు. ఆరుగురు కలిసి 19 బీర్లను తాగగా అందులో మణికుమార్ అనే యువకుడు అకస్మాత్తుగా అస్వస్తతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని గర్నిమిట్ట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు పీలేరు ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మణికుమార్ ప్రాణాలు విడిచాడు. దీంతో మృతుడి ఇంట విషాదం నెలకొంది. మరో యువకుడు పుష్పరాజ్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. అతడి పరిస్థితి కూడా విషమించడంతో చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పుష్పరాజ్ కూడా మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. అతిగా మద్యం సేవించడం వల్ల మరణించారా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పరిశోధన చేస్తున్నారు. సంఘటనా స్థలాన్నీ కూడా పరిశీలించి వివరాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనతో ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story