అనంతపురం హైవేపై 'ఆకతాయి'ల వీరంగం.. చొక్కాలు విప్పి.. ట్రిపుల్ రైడింగ్!

by Ramesh Naini |

జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా, చొక్కలు విప్పి బైక్ నడుపుతూ హల్ చల్ చేసిన మైనర్ల వ్యవహారం అనంతపురంలో కలకలం రేపింది.

అనంతపురం హైవేపై ఆకతాయిల వీరంగం.. చొక్కాలు విప్పి.. ట్రిపుల్ రైడింగ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా, చొక్కలు విప్పి బైక్ నడుపుతూ హల్ చల్ చేసిన మైనర్ల వ్యవహారం అనంతపురంలో కలకలం రేపింది. ‘పోలీసులు మమ్మల్ని ఏమీ చేయలేరు’ అంటూ విర్రవీగిన ఆ యువకులకు పోలీసులు తమదైన శైలిలో బుద్ధి చెప్పారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జాతీయ రహదారిపై కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఒకే బైక్‌పై ముగ్గురు యువకులు (ట్రిపుల్ రైడింగ్) ఎక్కడమే కాకుండా, ఓ వ్యక్తి చొక్కా విప్పి అర్ధనగ్నంగా విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేశారు.

అడ్డుకుంటే అహంకారపు మాటలు..

వీరి ప్రవర్తనను గమనించిన మరో వాహనదారుడు ఇదేమిటని ప్రశ్నించగా.. నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. ‘పోలీసులు మమ్మల్ని ఏమీ చేయలేరు’ అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. తాము మైనర్లమని, చట్టం తమను ఏమీ చేయదనే ధీమా వారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ఆధారంగా స్పందించిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానంతో బైక్ నంబర్‌ను గుర్తించారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టి ఆ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు మైనర్లుగా తేలారు.

అనంతరం పోలీసులు మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు భారీ జరిమానా విధించారు. వాహనం ఎవరి పేరు మీద ఉందో వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులు ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని, ఒకవేళ రోడ్డు ప్రమాదాలు జరిగితే వాహన యజమానులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Next Story