పిఠాపురం పీఠాధిప‌తి స‌నాత‌న‌ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ ఏమైంది? శ్యామల సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

సింహాచ‌లం ఆల‌యంలో జరిగిన ప్రమాదంపై వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పిఠాపురం పీఠాధిప‌తి స‌నాత‌న‌ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ ఏమైంది? శ్యామల సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: సింహాచ‌లం ఆల‌యంలో జరిగిన ప్రమాదంపై వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌మ‌స్త లోకాల‌ను కాపాడే, అంద‌రిలో భ‌యాన్ని హ‌రించే స్వామి విష‌యంలో ఎందుకు ప‌దేప‌దే అప‌శృతి జ‌రుగుతోంద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుండి హైందవులు విశ్వాసం కోల్పోయేలా, హైంద‌వ ధ‌ర్మానికి వ్య‌తిరేకంగా అనేక సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని అన్నారు. తిరుప‌తి ల‌డ్డూ విష‌యంలో చంద్ర‌బాబు జ‌గ‌న్ పై అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేసిన‌ప్ప‌టి నుండి క‌లియుగ దైవం క‌న్నెర్ర చేసిన‌ట్టు ఉంద‌ని ఆరోపించారు. ఆ త‌ర‌వాత‌నే వ‌రుస ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని విమ‌ర్శించారు.

వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం తొక్కిస‌లాట‌లో ఆరుగురు చ‌నిపోవ‌డం, 40మందికి గాయాలు అవ్వ‌డం, త‌ర‌వాత క‌డ‌ప జిల్లాలో కాతినాయ‌న స‌త్రంలో అన్న‌ధాన స‌త్రం కూల్చివేయ‌డం, త‌ర‌వాత టీటీడీ గోశాల‌లో వంద‌కు పైగా ఆవులు చనిపోవ‌డం, శ్రీకుడుమంలో తాబేళ్లు చ‌నిపోవ‌డం వాటిని ఈవో కార్యాల‌యం వెన‌క కాల్చివేయ‌డం ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయ‌ని విమ‌ర్శించారు. కూట‌మి వ‌చ్చాక జ‌రుగుతున్న ఇలాంటి వ‌రుస ఘ‌ట‌న‌ల‌ను ఏ విధంగా భావించాల‌ని ప్ర‌శ్నించారు.

టీడీపీ గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం చోటు చేసుకున్నాయ‌ని చెప్పారు. పుష్క‌రాల పేరుతో విజ‌య‌వాడ‌లో ఆల‌యాల‌ను కూల్చివేశార‌న్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత వాటిని మ‌ళ్లీ నిర్మించార‌ని తెలిపారు. మ‌ళ్లీ టీడీపీ వ‌చ్చాక వ‌రుస ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. తిరుమ‌ల కొండ‌పై మందు, ఎగ్ బిర్యానీలు దొర‌క‌డం క‌ల‌క‌లం రేపింద‌న్నారు. ఈ రోజు సింహాచ‌లంలో గోడ కూలి 8 మంది చ‌నిపోయార‌ని, 20 రోజుల క్రిత‌మే క‌ట్టిన గోడ ఎలా కూలిపోయింద‌ని ప్ర‌శ్నించారు. మీ కాసుల క‌క్కుర్తితోనే గోడ కూలింద‌ని మండిప‌డ్డారు. కూట‌మి నిజ‌స్వ‌రూపం ప్ర‌జ‌ల‌కు ఈరోజు అర్థం అయ్యింద‌ని అన్నారు. ప‌వ‌న్ స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు.

Next Story