వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యం: నాదెండ్ల మనోహర్

by Disha Web Desk 12 |
nadendla manohar
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అదే లక్ష్యంతో జనసేన పార్టీ ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌కు తాము కట్టుబడి ఉన్నామని ఇప్పటికే తమ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. విశాఖపట్నంలో నాదెండ్ల మనోహర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని, దాన్ని భరించలేక దాడులకు పాల్పడుతున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రంలో లా & ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని చెప్పుకొచ్చారు. తాను ఎక్కడ కాపురం పెడితే, అక్కడి నుంచే పరిపాలన అనే అభిప్రాయం కల్పించేలా సీఎం వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

మరిన్ని భేటీలు ఉంటాయి..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో పవన్ కల్యాణ్ భేటీ పైన నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ మరిన్ని సార్లు భేటీ అయి చర్చలు జరుపుతారని వెల్లడించారు. చంద్రబాబుతో పవన్ జరిపిన చర్చల్లోనూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో వారి మధ్య మరిన్ని చర్చలు జరుగుతాయని పవన్ కల్యాణ్ తెలిపారని పేర్కొన్నారు. మంచి ప్రణాళిక, వ్యూహంతో జనసేన అడుగులు వేస్తోందని తెలిపారు.

పదవుల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ రాజకీయంగా అడుగులు వేస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. చంద్రబాబుతో భేటీ పొత్తులో భాగంగానేనని సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలను నాదెండ్ల మనోహర్ ఖండించారు. వైసీపీ వ్యతిరేకులంతా ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామని..జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని అమలు చేస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Next Story

Most Viewed