సాక్షుల బెదిరింపు కేసు.. అజ్ఞాతంలోకి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు!

by Ramesh Naini |

దళిత యువకుడు (మాజీ డ్రైవర్) సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

సాక్షుల బెదిరింపు కేసు.. అజ్ఞాతంలోకి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దళిత యువకుడు (మాజీ డ్రైవర్) సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో తాజా కేసు నమోదు కావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

నాలుగు బృందాలతో గాలింపు

అనంతబాబు కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశాఖ, విజయవాడతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన కోసం ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో కాకినాడ జిల్లా సర్పవరం ఇన్‌ఛార్జి సీఐ రవికుమార్‌ను ఉన్నతాధికారులు వీఆర్ (VR) కు పంపారు.

నేడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ

సాక్షులను ప్రలోభపెడుతూ సుప్రీంకోర్టు బెయిల్ నిబంధనలను అనంతబాబు ఉల్లంఘించారని స్పెషల్ పీపీ ముప్పాళ్ల సుబ్బారావు రాజమండ్రి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరిన ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. తనపై సర్పవరం పీఎస్‌లో నమోదైన తాజా (సాక్షుల బెదిరింపు) కేసును కొట్టివేయాలని కోరుతూ అనంతబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి.

Next Story