అవన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి?

by Thanuru Gopichand |

ఎన్నికలకు ముందు మీరిచ్చిన 143 హామీలు ఏమయ్యాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అవన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలకు ముందు మీరిచ్చిన 143 హామీలు ఏమయ్యాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ‘బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ’ అనే నినాదం వినిపించారని గుర్తుచేశారు. 9 నెలల తర్వాత ‘బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్న విధంగా మారిందని సెటైర్ వేశారు. ఇంటింటికీ తిరిగి బాండ్లు పంచారని, హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకోవాలని అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు హామీలు ఎగ్గొట్టారు కదా.. ఎవరి చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు. కేవలం 9 నెలల కాలంలోనే అప్పుల్లో రికార్డు బద్దలు కొట్టారని ఆరోపించారు. చేసిన అప్పులు.. చేయబోతున్న అప్పులు కలిపి మొత్తం రూ.లక్షా45 వేల కోట్లు అయ్యాయన్నారు. ఇన్ని అప్పులు చేసినా ‘సూపర్ సిక్స్’ అమలు చేశారా? అని ప్రశ్నించారు.

అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత.. ఆసరా, జీరో వడ్డీ, ఆరోగ్యశ్రీ, వాహన మిత్ర.. ఇవన్నీ ఏమయ్యాయని జగన్ నిలదీశారు. మరి రూ.లక్షా45వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. ఇవన్నీ ఎవరి జేబులోకి పోతున్నాయని ఫైర్ అయ్యారు. ఈ 9 నెలల కాలంలో ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు.. కానీ ఏకంగా 2.65 లక్షల వలంటీర్ ఉద్యోగాలు తీసివేశారని ఆరోపించారు. బేవరేజెస్ కార్పొరేషన్‌లో 18 వేల ఉద్యోగాలు తొలగించారని విమర్శించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులనూ కుదించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే ఆయన ఆస్తులు పెంచుకోవడం, తన వారి ఆస్తులను పెంచుకోవటం అని హాట్ కామెంట్స్ చేశారు. ఇసుక, లిక్కర్ కొత్త విధానాలతో రాష్ట్రానికి ఆదాయం తగ్గిందన్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చీటింగ్‌లో పీహెచ్‌డీ చేశారని ఎద్దేవా చేశారు

Next Story