వారెవ్వా.. ఇదేం జగన్నాటకం.! సొంత ఆఫీసుకే నిప్పంటించి డ్రామాలా?

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-11 01:46:02  IST  )

అమరావతి (Amaravati) వేశ్యాల రాజధాని అంటూ ‘సాక్షి’ టీవీలో చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.

వారెవ్వా.. ఇదేం జగన్నాటకం.! సొంత ఆఫీసుకే నిప్పంటించి డ్రామాలా?
X

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి (Amaravati) వేశ్యాల రాజధాని అంటూ ‘సాక్షి’ టీవీలో చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ముఖ్యంగా మహిళా లోకం భగ్గుమంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాల ఎదుట అతివలు ఉధృతంగా ఆందోళనను నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా వైఎస్ భారతి (YS Bharati) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ చెప్పులు, చీపుళ్లు, చాటలు చూపుతూ ‘సాక్షి’ పత్రికలను దగ్ధం చేస్తున్నారు. ఇప్పటికే మహిళలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో జర్నలిస్టులు కృష్ణంరాజు (Krishnam Raju)తో పాటు కొమ్మినేని శ్రీనివాస రావు (Kommineni Srinivasa Rao)పై పోలీసులకు ఫిర్యాదులు అందగా.. వారికి కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ (TDP) సోషల్ మీడియా మొత్తం వ్యవహారాన్ని వైసీపీ (YCP)పై రాజకీయ కక్షగా చిత్రీకరిస్తూ.. ‘సాక్షి’ మీడియా దుష్ప్రచారానికి పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తోంది.

సాక్షి ఆఫీసుకు నిప్పు అంటూ కొత్త డ్రామాలు..

మరోవైపు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా.. ఇవాళ తెలుగు మహిళలు ఏలూరు (Eluru) ‘సాక్షి’ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ‘సాక్షి’ మీడియా కార్యాలయంలో ఫర్నీచర్‌కు నిప్పంటించారనే వార్త ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో హీట్‌ను పుట్టించింది. తెలుగు మహిళలు, టీడీపీ కార్యకర్తలే ఆఫీసుకు నిప్పు పెట్టారంటూ సోషల్ మీడియాలో వైసీపీ సైకో మూక దుష్ప్రచారానికి తెర లేపింది. అయితే, ఈ ఘటన వెనుక మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రాజకీయ కుట్ర ఉందని, రాజధాని అమరావతి మహిళలపై ‘సాక్షి’ టీవీలో ప్రసారమైన అసభ్యకర వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లీంచేందుకే కొత్త డ్రామాకు తెర లేపారంటూ టీడీపీ, జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. రెండు నెలల క్రితం తాడేపల్లి ప్యాలెస్ (Thadepally Palace) ముందు ఉన్న గార్డెన్ తానే తగలబెట్టుకుని, సీఎం చంద్రబాబు (CM Chandrababu) మీద తోసివేసినట్లుగా.. సరిగ్గా అదే రీతిలో నేడు ఏలూరులో సాక్షి కార్యాలయంలో వారే పెట్రోల్ పోసి నిప్పంటించుకుని పక్కాగా ప్లాన్ చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో గార్డన్ తగులబడిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ (CCTV Footage)ను పోలీసులు ఇవ్వమని అడిగినా.. వారు ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఏలూరు సాక్షి కార్యాలయం ఫర్నీచర్ దహనం ఘటనపై ఏలూరు త్రీ టౌన్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు.

ఏడాది సుపరిపాలన వేడుకలను అడ్డుకోవడానికేనా..

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్‌ (Good Governance- Golden Andhra Pradesh) పేరుతో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ సీఎస్‌ విజయానంద్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిలభారత సర్వీసు అధికారులతో కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే, ఆ కార్యక్రమాన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని వైసీపీ సైకో మూక కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏలూరులోని తమ ‘సాక్షి’ కార్యాలయానికి తామే నిప్పు పెట్టుకుని.. కుతంత్రాలకు జగన్ కుట్రకు తెర లేపారని రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, విజ్ఞులైన రాష్ట్ర ప్రజల ముందే జగన్ కుప్పిగంతులు, కుంతంత్రాలు చెల్లవంటూ టీడీపీ నాయకులు వైసీపీ కుట్రలను తిప్పి కొట్టే పనిలో ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వైసీపీ, జగన్ అరాచకాలపై నెటిజన్లు ఓ రేంజ్‌లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా.. చీప్ పాలిటిక్స్ మానేసి ప్రజలకు మంచి చేసి జనాన్ని నీ వైపు తిప్పుకునే ఆలోచనలు చేయాలంటూ హితవు పలుకుతున్నారు. ఒకవేళ అదీ చేతకాకపోతే సైలెంట్‌గా తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చోవాలని.. ఐదేళ్ల రాక్షస పాలనకు స్వస్తి పలికిన వేళ ఆంధ్రా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ ఏడాది సూపరిపాలన వేడుకలు జరుపుకుంటున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.

Next Story
null