అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు: ఎంపీ మిథున్ రెడ్డి

by Malleboina Mahesh |

అమరావతి రైతులకు ప్లాట్ల పంపిణీపై లోక్‌సభలో ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నలు. ప్రత్యేక హోదా, పోలవరంపై ఏపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీత.

అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు: ఎంపీ మిథున్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని అమరావతి బిల్లును ప్రవేశ పెట్టి అసెంబ్లీ ఆమోదంతో పార్లమెంటుకు పంపిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఈ రోజు లోక్ సభ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో రాజధాని అమరావతికి మద్దతు ఇస్తున్నామని, కానీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం అని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల సమస్యలపై లోక్‌సభలో గళమెత్తారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన 34 వేల ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. బుధవారం సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, అమరావతి రైతుల ఆవేదనను సభ దృష్టికి తీసుకువచ్చారు.

రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్లాట్ల పంపిణీ జరగలేదు. రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన గడువును బిల్లులో చేర్చాలి" అని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే తన పొలం ఎక్కడ ఉందో, ప్లాట్ ఎప్పుడు ఇస్తారో తెలియక ఆందోళనతో రామారావు అనే రైతు గుండెపోటుతో మరణించారని, ఇటువంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడాల్సింది పోయి, కేవలం ఒక ప్రాంతం గురించే మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి రాష్ట్రంలోని ఇతర సభ్యులు కేంద్రాన్ని నిలదీస్తే బాగుండేదని ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో వ్యాఖ్యానించారు.

Next Story