- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ ప్రతినిధి, ఏలూరు: తమ్మిలేరు వరద ఉధృతి ఏలూరును భయపెడుతోంది. ఏలూరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద ఉన్న తమ్మిలేరు జలాశయంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. సుమారు 5 వేల క్యూసెక్కుల నీరు ప్రాజక్టులోకి వచ్చి చేరుతుండడంతో దిగువకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పూర్తి సామర్ధ్యం 355 అడుగులు కాగా, ప్రస్తుతం మంగళవారం సాయంత్రానికి 346 అడుగుల నీటిమట్టం ఉందని ఇరిగేషన్ ఎస్‌ఈ చిలకపాటి దేవ ప్రకాశ్ తెలిపారు. ఏలూరు ఎఫ్‌సిఐ గోడౌన్ వద్ద 15 అడుగుల వరకు వరద నీరు వచ్చిందని ఆయన వివరించారు. దీంతో ఏలూరు నగరానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు. తమ్మిలేరు వరద ఉధృతంగా రావడంతో అమీనాపేట నుండి శనివారపుపేట మధ్య తమ్మిలేరుపై ఉన్న కాజ్‌వేపై రెండడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కాజ్‌వేపై రాకపోకలను పోలీసులు నిలిపివేసి అటూ ఇటూ బారికేడ్లు పెట్టారు. వరద తగ్గే వరకుప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్‌పి కొమ్మి ప్రతాప శివకిశోర్ సూచించారు.
కాగా, వరద నీరు తంగెళ్ళమూడి ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి ప్రవేశించింది. కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అండర్ పాస్‌లో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అండర్‌పాస్ రహదారిని మూసివేశారు. అటువైపు ఎవరూ వెళ్ళకుండా చర్యలు తీసుకుంటున్నారు. వరద నీరు తూర్పు, పడమర లాకుల నుండి కొల్లేరులోకి వెళ్తోంది. ప్రస్తుతం ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎగువన వర్షాలు లేనందున వరద తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారపుపేట కాజ్‌వేను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాజ్‌వే స్థానంలో వంతెన నిర్మించాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఆర్ధిక మంజూరు కాగానే ఈ ఏడాదిలోనే శంకుస్థాపన చేస్తామని,వచ్చే ఏడాదికి ఇక్కడ వంతెన నిర్మిస్తామని చెప్పారు.






