బీసీల ఖార్ఖానా టీడీపీ

by Disha Web Desk 16 |
బీసీల ఖార్ఖానా టీడీపీ
X
  • టీడీపీ అంటే బీసీలు..బీసీలు అంటే టీడీపీ
  • 50శాతానికిపైగా జనాభా ఉన్న బీసీలకు న్యాయం జరగడం లేదు
  • టీడీపీ 34శాతం రిజర్వేషన్లు ఇస్తే వైసీపీ 24శాతానికి తగ్గించింది
  • కీలకమైన పదవులన్నీ జగన్ వర్గానివే
  • జంగారెడ్డి గూడెంలో 'ఇదేం ఖర్మ – మన రాష్ట్రానికి' కార్యక్రమం
  • - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు.. బీసీలు అంటేనే టీడీపీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్ర్యానంతరం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లతో కొంత న్యాయం జరిగితే..50 శాతానికి పైగా జనాభా కలిగిన బీసీలకు మాత్రం జరగలేదని ఆయన అన్నారు. చేతి వృత్తులు, కుల వృత్తులపై ఆధారపడిన బీసీలు ఆధునిక కాలంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారని..దీంతో నాడు ఎన్టీఆర్ బీసీలను ఆదుకోవడమే ధ్యేయంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారని గుర్తు చేశారు. వేలాది మంది బీసీలను నాయకులిగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. యనమల రామకృష్ణుడు, కె.ఇ.కృష్ణమూర్తి, అయ్యన్న పాత్రుడు, ఎర్రన్నాయుడు లాంటి ఉద్దండుల ఖార్ఖానా తెలుగుదేశం పార్టీ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో 'ఇదేం ఖర్మ – మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు బీసీ వర్గాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీలు రాజకీయాల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 24 శాతం ఉన్న రిజర్వేషన్లను 34 శాతానికి పెంచితే జగన్ రెడ్డి ఆ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించాడని చంద్రబాబు ఆరోపించారు. ఫలితంగా 16,800 మందికి పదవులు నోచుకోలేకుండా పోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

వైఎస్‌ను ఫాలో అవుతున్న జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బీసీలకు పదవులిచ్చాం.. ఉద్దరించాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. ఒకరికి పదవి ఇచ్చి వారి నెత్తిపై సొంత వ్యక్తిని ఇన్‌చార్జిగా పెట్టి పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. బీసీలు ఐక్యంగా ఉండడం ఇష్టం లేక వారి మధ్య చిచ్చు పెట్టి, బీసీలను అణగదొక్కి రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ బీసీలను ఆర్ధికంగా పురోభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. టీడీపీ 54 బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేసిందని ఈ కమిటీలన్నీ ప్రజల్లో తిరిగి ఆయా కులాల్లోని ప్రజల అవసరాలు తెలుసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా మెరుగైన స్థానంలో బీసీలను నిలిపేందుకు సహకరించాలని కోరారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో సబ్ ప్లాన్ ద్వారా రూ.36 వేల కోట్లు కేటాయించి.. రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ జగన్ ఇంత వరకు ఏం ఖర్చు చేశాడో చెప్పే ధైర్యం లేదని విమర్శించారు. గతంలో వైఎస్ఆర్ బీసీల కోసం ఫెడరేషన్లు పెట్టాడు. నిధులివ్వలేదు. ఇప్పుడు కూడా సీఎం జగన్ అదే చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

పదవులన్నీ ఆ సామాజిక వర్గానికే

కీలకమైన పదవుల్లో నామినేటెడ్ పోస్టుల్లో సీఎం జగన్ బీసీలకు ప్రాధాన్యం కల్పించలేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టీటీడీలో 37 మంది సభ్యులుంటే ముగ్గురికి అవకాశం ఇచ్చారని అలాగే యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌ అవకాశాల్లోనూ మొండి చేయి చూపారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తు్న్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, డీజీపీ, సీఎస్.. సలహాదారులు ఇలా అంతా తమ వారినే నియమించుకున్నారని మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి నలుగురు రెడ్లకు రాసిచ్చేసి.. వారిని రాష్ట్రంపై పెత్తనం చేయిస్తున్నారని విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట అని...2014 నాటి సీన్ 2024లో రిపీట్ అవుతుందని తెలిసి జగన్ వణుకుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.

ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించండి

మత్స్యకారులను మరింత అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లపై హక్కుల్ని కల్పిస్తే.. వైఎస్ జగన్ తన బినామీల కోసం జీవో నెం.217 ఇచ్చి ఆ హక్కుల్ని కూడా వారి నుండి లాక్కున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంతేకాదు గీత కార్మికుల పొట్ట కొట్టి తన కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్ది ప్రాణాలు తీస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మరోవైపు టీడీపీ హయాంలో 1187 బీసీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుడితే.. జగన్ రెడ్డి మొత్తాన్ని నాశనం చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని తెలియజేసేందుకే 'ఇదేం ఖర్మ – మన రాష్ట్రానికి' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ జనాల్లోకి వెళ్లాలని.... రాష్ట్రానికి పట్టిన ఈ దరిద్రాన్ని వదిలించేలా ప్రజల్ని చైతన్యం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

సంక్షేమమంటూ వేధింపులా?

వైసీపీ ప్రభుత్వం బీసీ సంక్షేమం అని ఒకవైపు అంటూనే అదే సామాజిక వర్గంపై దాడులకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 26 మంది బీసీ నాయకులను హత్య చేసిన సీఎం జగన్ వందలాది మందిపై దాడులు చేయించారని ఆరోపించారు. అంతేకాదు తప్పుడు కేసులు పెట్టి వేధించారని..ఇదేనా బీసీ సంక్షేమం? అని చంద్రబాబు నిలదీశారు. 'ఎవరో ఇద్దరి మధ్య గొడవలో హత్య జరిగితే కొల్లు రవీంద్రను జైల్లో పెట్టారు. ఫిర్యాదులో పేరు లేకపోయినా అయ్యన్నపై కేసు పెట్టారు. పెళ్లికి వెళ్లినందుకు యనమల రామకృష్ణుడిపై అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారు. ఫోటో తీయడాన్ని ప్రశ్నించినందుకు 70 ఏళ్ల వయసున్న అయ్యన్నపై రేప్ కేసు పెట్టారు. ఈ దుర్మార్గపు జగన్ రెడ్డిని గద్దె దించేందుకు బీసీలంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. 54 సాధికార కమిటీ సభ్యులు ప్రజల్లోకి వెళ్లి.. జగన్ రెడ్డిని ఉతికి ఆరేయండి. జగన్ రెడ్డి చేస్తున్న దగా, దుర్మార్గాన్ని ప్రజలకు వివరించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

టీడీపీకి అస్త్రంలా ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఇక పోరుబాటేనట


Next Story

Most Viewed