- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం: ఏపీ హాస్పిటాలిటీ రంగంపై ఆర్థిక ఒత్తిడి
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఏపీ హోటల్ రంగంపై పడింది. గ్యాస్ కొరత, ధరల పెరుగుదల కారణంగా ఆర్థిక ఒత్తిడి పెరిగిందని యాజమాన్యాలు వాపోతున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో : వెస్ట్ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఆంధ్రప్రదేశ్ హాస్పిటాలిటీ రంగంపై, ముఖ్యంగా స్టార్ హోటల్ విభాగంపై తీవ్రంగా పడుతోందని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం వల్ల ఖర్చుల ఒత్తిడి పెరిగిందని తెలిపింది. రవాణా, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు, సేవల నిర్వహణ వంటి అన్ని విభాగాల్లో వ్యయాలు పెరిగి, ఆపరేటింగ్ ఖర్చులు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. ముఖ్యంగా ఎల్పీజీ సరఫరా అస్థిరత, ధరల పెరుగుదల హోటల్ రంగానికి పెద్ద సవాలుగా మారినట్లు వాపోయింది. వంటగదులకు కీలకమైన ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్ ఆలస్యం, సరఫరా లోపాలు కారణంగా ఆహార తయారీపై ప్రభావం పడుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో హోటళ్లు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అన్వేషిస్తున్నప్పటికీ, ఖర్చుతో కూడుకున్నవిగా మారుతున్నట్లు తెలిపింది.
కుకింగ్ ఆయిల్, రవాణా, ఇతర అవసరమైన వస్తువుల ధరలు పెరగడంతో మెనూ ధరలను 20–30 శాతం వరకు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. అయినప్పటికీ వినియోగదారుల సంతృప్తి దృష్ట్యా కొంత ఖర్చును హోటళ్లు స్వయంగా భరిస్తున్నాయని వెల్లడించింది. నిరంతర ఖర్చుల పెరుగుదల లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు హోటళ్లు వంటగది ప్రక్రియల మెరుగుదల, మెనూ సరళీకరణ, శక్తి వినియోగ నియంత్రణ వంటి చర్యలు చేపట్టాయని అసోసియేషన్ పేర్కొంది. ఇదే సమయంలో విమాన ఇంధన ధరలు పెరగడం వల్ల ఎయిర్ ఫేర్‌లు అధికమై, కార్పొరేట్, వినోద పర్యటనలపై ప్రభావం పడుతోందని తెలిపింది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ స్థాయిలు స్థిరంగా ఉన్నప్పటికీ, పరిస్థితి కొనసాగితే డిమాండ్ తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉద్యోగాల పరంగా ప్రస్తుతం స్థిరత్వం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో పరిస్థితి మారితే ఉద్యోగ భద్రతపై ప్రభావం పడే అవకాశముందని తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి నిర్వహించగలిగిన స్థాయిలో ఉన్నప్పటికీ పరిశ్రమ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని, పరిస్థితి విషమిస్తే వృద్ధిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అసోసియేషన్ పేర్కొంది. హోటల్ రంగానికి అత్యంత కీలకమైన ఎల్పీజీ సరఫరా నిరంతరంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇన్‌పుట్ ఖర్చులను నియంత్రించేందుకు తగిన సహాయాన్ని అందించాలని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి.స్వామి విజ్ఞప్తి చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ అత్యుత్తమ హాస్పిటాలిటీ సేవలను అందించడంలో తమ నిబద్ధత కొనసాగుతుందని ఆయన తెలిపారు.






