ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం: మంత్రి నారా లోకేష్

by Malleboina Mahesh |   (  Updated:2025-12-07 06:12:00  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం: మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డల్లాస్ చేరుకున్న ఆయనకు అక్కడ ప్రవాసాంధ్రులు ఆత్మీయ స్వాగతం పలికారు. నాలుగు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్న లోకేష్ నేడు డల్లాస్ లో తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. డల్లాస్ నగరంలో వేలాది మంది తెలుగు ప్రవాసులను ఉద్దేశిస్తూ మంత్రి నారా లోకేష్ భావోద్వేగంగా మాట్లాడారు. కష్ట సమయంలో పార్టీకి అండగా నిలిచిన ఎన్ఆర్ఐలను “Most Reliable Indians – MRIs”గా అభివర్ణించారు. ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లలో 164 సీట్ల చారిత్రాత్మక విజయం సాధించడంలో ప్రవాసుల పాత్ర అమూల్యమని కొనియాడారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ముందుకు వెళ్తోందని, “స్పీడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఏపీ నిలుస్తోంది” అని అన్నారు. 8 కీలక పరిశ్రమల, సాంకేతిక రంగాల్లో వికేంద్రీకృత అభివృద్ధి ఊపందుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల సృష్టినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పటికే ₹20 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, వాటితో 16 లక్షల ఉద్యోగావకాశాలు లభించే స్థితికి వచ్చామని వెల్లడించారు.

విదేశాల్లో ఉన్న తెలుగు విద్యార్థుల కోసం వచ్చే ఏడాది నుంచి ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని, విదేశాల్లోని ప్రతి తెలుగు కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా APNRT పూర్తిగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. యువత ఉద్యోగాల కోసం తిరిగేవారిగా కాకుండా, ఉద్యోగాలు కల్పించే నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అలాగే, ఎన్డీఏ ప్రభుత్వం కనీసం 15 ఏళ్ల పాటు అంతరాయం లేకుండా స్థిరమైన పాలనతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. మహిళలను అవమానించిన వారందరికీ తప్పకుండా శిక్ష పడుతుందని, అయితే ప్రభుత్వం ప్రధాన దృష్టి పూర్తిగా అభివృద్ధి, సంక్షేమంపైనే ఉంటుందని స్పష్టం చేశారు.

Next Story