అమరావతిని అగ్రగామి ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: కేంద్రమంత్రి

by Thanuru Gopichand |   (  Updated:2025-11-28 08:29:45  IST  )

అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం అంటే ఒక యజ్ఞం వంటిదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

అమరావతిని అగ్రగామి ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: కేంద్రమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం అంటే ఒక యజ్ఞం వంటిదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతిలో బ్యాంకు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యమైన విషయం కాదన్నారు. ఆర్థికంగా ఎంతో వ్యయప్రయాసలను కూర్చాల్సి ఉంటుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోనే అగ్రగామి ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రూ. 1334 కోట్ల వ్యయంతో 25కు పైగా బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు.

​అమరావతి నిర్మాణం ఆగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పునర్నిర్మాణానికి అంకితభావంతో పనిచేయడం శుభ పరిణామంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంకల్పం కలిసి రాష్ట్రానికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయన్నారు. రాజధాని మౌలిక వసతుల కల్పన కోసం, ప్రత్యేకించి ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కట్టుబడి ఉందన్నారు. అమరావతి అభివృద్ధికి అవసరమైన నిధులను, సాంకేతిక సహకారాన్ని కేంద్రం అందిస్తుందని వివరించారు.

​ఒకే ప్రాంతంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 25కు పైగా బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు కావడం అనేది అత్యంత అరుదైన, కీలకమైన ఘట్టంగా పేర్కొన్నారు. ఈ "ఫైనాన్షియల్ హబ్" కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు అన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పునాది అని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో అమరావతి ఒకటిగా నిలవడానికి ఈ పెట్టుబడులు దోహదపడతాయి అన్నారు. ఈ కేంద్ర కార్యాలయాలు రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తాయన్నారు.

​ఈ బహుళ ప్రధాన కార్యాలయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు అమరావతి ఒక కేంద్రంగా మారుతుందన్నారు. ఇది రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుతుందని తెలియజేశారు.

బ్యాంకులన్నీ రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవటం బాధ్యతగా భావించాలన్నారు. బ్యాంకులు కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వడానికే పరిమితం కావొద్దని సూచించారు. దానిని మించి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలన్నారు. రైతులు దేశానికి పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు. మహారాష్ట్ర నుంచి అరటి, తమిళనాడు నుంచి కొబ్బరి ఢిల్లీ , ముంబై లాంటి ప్రాంతాలకు రైళ్లలో తరలుతున్నాయన్నారు. ఏపీలోని రాయలసీమలో ఉన్న 9 జిల్లాల నుంచి ఉద్యాన ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల మార్కెట్ లకు తరలించడానికి బ్యాంకులు సహకరించాలన్నారు. ప్యాకింగ్, కోల్డ్ చెయిన్ లాంటి పరిశ్రమల్ని కూడా ప్రోత్సహించాలని గుర్తుంచుకోవాలన్నారు.

గతంలో మహిళల్ని బీమా ఏజెంటుగా మార్చేందుకు మహిళా సఖి పేరిట కార్యక్రమం ప్రారంభిస్తే అద్భుత ప్రయోజనాలు వచ్చాయని గుర్తు చేశారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినా ప్రధాని మోదీ తక్షణం అమోదిస్తారన్నారు. విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా సహకరించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారన్నారు. ఏడాదిన్నరలో ఏపీ ఫ్యూచరిస్టిక్ కేపిటల్ నగరం అవుతుందన్నారు. అమరాతిలో కాస్మోస్ ప్లానెటోరియం నిర్మించాలని కోరుతున్నామన్నారు. ఆచార్య నాగార్జునుడు లాంటి శాస్త్రీయ పరిశోధకులు నివసించిన ప్రాంతం ఏపీ అన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ పై కూడా కేంద్రం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుందని, రంగంలో కూడా ఏపీ పనిచేయాలని కోరారు.

​ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల ఆర్థికంగా ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించి, స్థిరమైన ప్రగతిని సాధించే దిశగా ప్రయాణించాలని కేంద్రం ఆకాంక్షిస్తోందన్నారు. కేంద్రం అందిస్తున్న నిధులను సక్రమంగా, పారదర్శకంగా వినియోగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కేంద్రమంత్రి ఈ సందర్భంగా కోరారు. రాష్ట్రం తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయానికి కేంద్రం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. ​ఈ శంకుస్థాపన కార్యక్రమం అమరావతి చరిత్రలో ఒక నూతన అధ్యాయమని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తును సాధిస్తుందని కేంద్రమంత్రి సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story