ట్రూప్ అప్ ను.. ట్రూ డౌన్ చేస్తున్నాం : మంత్రి గొట్టిపాటి

by Thanuru Gopichand |

వైయస్ జగన్ (YS Jagan) నాయకత్వంలోని వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచారు. ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజలపై భారాన్ని మోపారు.

ట్రూప్ అప్ ను.. ట్రూ డౌన్ చేస్తున్నాం : మంత్రి గొట్టిపాటి
X

దిశ, వెబ్ డెస్క్ : వైయస్ జగన్ (YS Jagan) నాయకత్వంలోని వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచారు. ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజలపై భారాన్ని మోపారు. ట్రూ అప్ ఛార్జీలతో ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డారు. తాము ఆ ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ ఛార్జీల దిశగా తీసుకెళ్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) అన్నారు. అందుకు అనుగుణమైన కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఏపీ సూర్యఘర్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులపై ధరల భారం తగ్గుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏపీ సూర్యఘర్ పథకం కింద 10 వేల కనెక్షన్లను ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ ధరల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. పలుమార్లు ఛార్జీలను పెంచి పేద, మధ్య తరగతి వారి నడ్డి విరిచిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలను అర్థం చేసుకుందని పేర్కొన్నారు. ఆర్థిక ఒత్తిడులు ఉన్నప్పటికీ ధరల భారాన్ని ప్రజలపై పడకుండా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గత ప్రభుత్వం బకాయిపడ్డ మొత్తాలను చెల్లించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ఆదాయ వనరుగా మాత్రమే చూసిందని స్పష్టం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి అనతి కాలంలోనే విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టిందని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

Next Story