‘మేము క్షేమంగానే ఉన్నాం’ ఉమ్రా యాత్రకు వెళ్లిన ఆంధ్రావాసుల వీడియో విడుదల

by Ramesh Naini |

హజ్-ఉమ్రా యాత్రికులను కుదిపేసిన ఘోర బస్సు ప్రమాదం ఘటన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు ఒక వీడియో విడుదల చేసి తాము సురక్షితంగా ఉన్నామని వెల్లడించారు.

‘మేము క్షేమంగానే ఉన్నాం’ ఉమ్రా యాత్రకు వెళ్లిన ఆంధ్రావాసుల వీడియో విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: సౌదీ అరేబియాలో హజ్-ఉమ్రా యాత్రికులను కుదిపేసిన ఘోర బస్సు ప్రమాదం ఘటన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు ఒక వీడియో విడుదల చేసి తాము సురక్షితంగా ఉన్నామని వెల్లడించారు. గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లిన తామంతా క్షేమంగానే ఉన్నామని, ప్రమాదం గురించి తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందకూడదని కోరారు. అల్లా దయతో తమ యాత్ర ప్రశాంతంగా సాగుతోందని, ఉమ్రా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని త్వరలోనే స్వస్థలాలకు చేరుకుంటామని వారు స్పష్టం చేశారు.

సౌదీ అరేబియాలో సోమవారం రాత్రి జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 45 మంది యాత్రికులు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన ఈ బృందం ప్రయాణిస్తున్న బస్సు ఒక డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది. విషాదకర ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని తాజాగా రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ యాత్రికుల వీడియో కుటుంబాల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించింది. యాత్రికులందరూ సురక్షితంగా ఉన్నారని వారు వీడియో ద్వారా తెలియజేయడంతో వారి కుటుంబ సభ్యులకు కొంత ఊరట లభించినట్లైంది.

Next Story