- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: ఈ గ్రామానికి అన్నీ కష్టాలు.. తెలిస్తే కన్నీరు పెట్టుకోవాల్సిందే...!
విజయనగరం జిల్లా రేగ పుణ్యగిరికి రోడ్డు సౌకర్యం లేక గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు...

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో డోలీ కష్టాలు తప్పడం లేదు. రాత్రి సమయంలో గర్భిణీలకు పురి నొప్పులు వస్తే కటిక చీకట్లలోనే ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాలకు రాహదారులు లేక రాళ్లు, రప్పలు, అటవీ మార్గంలోనే గర్భిణీలను డోలీలోనే తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో ప్రసవం జరిగి తీవ్ర ఇబ్బందులు పడిన దుస్థితులు కూడా గతంలో జరిగాయి. ఎన్ని సార్లు స్థానిక అధికారులకు చెప్పినా కనికరించడంలేదు.
శృంగవరపు కోట నియోజకవర్గంలో రేగ పుణ్యగిరి గిరిజన గ్రామం చాలా వెనుకబడి ఉంది. శృంగవరకూ కోటకు ఐదు కిలో మీటర్లు దూరంలో కొండలపై ఈ గ్రామం ఉంది. అయితే గ్రామంలో సరైన సౌకర్యాలు లేవు. రహదారులు లేవు. అంబులెన్సులు రావు. రోగులు, గర్భిణులను డోలిలో కొండరాళ్ల మధ్యనే ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. రాత్రి అయితే సెల్ ఫోన్లు లైట్లు, టార్చి లైట్లతో అడవి మార్గంలో నడవాల్సి వస్తోంది. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రికి తరలించే క్రమంలో నలుగురు మృతి చెందారు.
ఇటీవల కాలంలో డోలీలో తరలిస్తుండగా ఓ మహిళ ప్రసవించారు. ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైతే భుజంపై మోసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లిన పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా ఇక్కడి గిరిజనులకు ఇళ్ల సౌకర్యాలు కూడా సరిగా లేవు. గతంలో రోకులు షెడ్డులు నిర్మించారు. అయితే వర్షం పడితే నీటిలోనే గడపాల్సిన పరిస్థితి. ప్రభుత్వ పథకాలకు కూడా ఆమడ దూరంలోనే ఈ గ్రామం ఉంది. అటు పోడు భూముల సమస్య కూడా పెండింగ్‌లోనే ఉంది. అయితే స్థానిక కలెక్టర్ స్పందించి మార్చి 31 లోపు గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అయితే కొంతదూరం మాత్రమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారని, ఆ తర్వాత నిలిపివేశారని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామం వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే తమకు స్వాతంత్య్రం వచ్చినట్లేనని అంటున్నారు.






