‘అర్బన్ నక్సలైట్’ అంటూ ప్రకాశ్ రాజ్‌పై విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.

‘అర్బన్ నక్సలైట్’ అంటూ ప్రకాశ్ రాజ్‌పై విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. శనివారం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి ఆయన ఘాటైన ఆరోపణలు చేశారు. చరిత్రను వక్రీకరించడం కాదు.. వాస్తవాలను తెలుసుకోకుండా సినిమా డైలాగులు ఆర్ఎస్ఎస్ పైన చెప్పడం మానుకోండి, అర్బన్ నక్సలైట్ ప్రకాశ్ రాజ్.. అంటూ విమర్శించారు. RSSకు స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర లేదంటారా? 1921లో జైలుకెళ్లిన డా. హెడ్గేవార్ చరిత్ర తెలుసుకోండని సూచించారు. పటేల్ RSSను బ్యాన్ చేశారా? ఆధారాలు లేవని తేలాక ఆయనే బ్యాన్ తొలగించారని అన్నారు. మహిళలు RSSలో లేరా? రాష్ట్ర సేవికా సమితి ఏ 50 ఏళ్లుగా లక్షల మంది మహిళలతో పనిచేస్తోందన్నారు. దేశంలో విపత్తుల సమయంలో ఎవరు సేవ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. RSS సంస్థ, లక్షలాది కార్యకర్తలు, తమ ప్రాణాలు తెగించి మానవత్వంతో సేవ చేస్తుందని తెలిపారు.

‘మావోయిస్టులు గురించి ఉపన్యాసాలు? 2000 నుంచి 2025 వరకు మావోయిస్టుల దాడుల్లో సుమారు 2,722 మంది పోలీసులు చనిపోయారు. అప్పుడు నీవు ఎందుకు ఖండించలేదు? నేడు జన జీవనంలోకి వచ్చిన మావోయిస్టు నేతలే అడవిలో ఉన్న తోటివారిని తుపాకుల హింసను ఆపమంటున్నారు. నేడు వారిని రెచ్చగొట్టే నీవు ఎందుకు తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్లడం లేదు? పోనీ, నీ కుటుంబంలో పిల్లల్ని పంపుతావా? పేద గిరిజన తండాల్లోని ఆదివాసీ గిరిజనుల జీవితాలను నాశనం చేయడం ఆపండి. లేకపోతే చరిత్ర నిన్ను క్షమించదు!’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story