- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘న్యాయం చేయకపోతే ఇక్కడే చచ్చిపోతా’.. కోర్టులో బ్లేడుతో మహిళ హల్‌చల్.. వైరల్
విశాఖపట్నం జిల్లా కోర్టులో సోమవారం మధ్యాహ్నం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖపట్నం జిల్లా కోర్టులో సోమవారం మధ్యాహ్నం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ సివిల్ కేసులో న్యాయవాది తనను తీవ్రంగా మోసం చేశాడంటూ ఓ మహిళ కోర్టు హాల్లోకి దూసుకెళ్లి వీరంగం సృష్టించింది. తనకు న్యాయం చేయకపోతే అక్కడికక్కడే బ్లేడుతో గొంతు కోసుకుని చనిపోతానంటూ మహిళా న్యాయమూర్తి ఎదుటే బెదిరింపులకు దిగడంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం కోర్టులో మహిళ సృష్టించిన కలకలానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
లాయర్ మోసం చేశాడంటూ ఆవేదన..
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అక్కయ్యపాలేనికి చెందిన లక్ష్మి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం రెండో ఏడీజే కోర్టు హాల్లోకి ప్రవేశించింది. నేరుగా మహిళా న్యాయమూర్తి ఎదుట నిల్చుని తన గోడు వెళ్లబోసుకుంది. ఓ సివిల్ కేసు విషయమై సత్యనారాయణ మూర్తి అనే న్యాయవాదికి తాను ఫీజు చెల్లించానని, అయితే ఆయన అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది. న్యాయం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నాడని, కానీ ఎలాంటి సహాయం చేయకుండా తనను మోసం చేశాడని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
‘సచ్చిపోతా’ అంటూ బెదిరింపులు..
లాయర్ తీసుకున్న డబ్బును తనకు తిరిగి ఇప్పించాలని, లేనిపక్షంలో ఇక్కడే పీక కోసుకుని ప్రాణాలు తీసుకుంటానని తన వెంట తెచ్చుకున్న కత్తి (బ్లేడు) చూపించి హల్‌చల్ చేసింది. ‘నాకు న్యాయం చేయకపోతే నేను సచ్చిపోతా’ అంటూ కోర్టు రూంలో కేకలు వేయడంతో అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మహిళ అనూహ్య చర్యతో అప్రమత్తమైన తోటి లాయర్లు, కోర్టు విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. తీవ్ర ఉద్వేగంతో ఉన్న మహిళను అతికష్టం మీద ఊరడించి, ఆమె వద్ద ఉన్న బ్లేడును పక్కకు తప్పించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, ప్రాథమిక విచారణలో సదరు మహిళ మానసిక పరిస్థితి సరిగా లేనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెకు తగిన కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించి వేశారు.






