బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారుల విడుదల

by Ramesh Naini |

గత మూడు నెలలుగా బంగ్లాదేశ్‌ జైలులో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారుల కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి.

బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారుల విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత మూడు నెలలుగా బంగ్లాదేశ్‌ జైలులో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారుల కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. వీరి విడుదలపై నెలకొన్న చట్టపరమైన అడ్డంకులను బంగ్లాదేశ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తొలగించడంతో, వీరంతా త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నారు. ఈ నెల 29న వీరిని అధికారికంగా విడుదల చేయనున్నట్లు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ తెలిపింది.

అసలేం జరిగింది?

గత ఏడాది అక్టోబర్ 22న విశాఖపట్నం హార్బర్ నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు, సముద్రంలో దిశ తెలియక పొరపాటున అంతర్జాతీయ సరిహద్దులు (IMBL) దాటి బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. దీనిని గుర్తించిన బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని, భగర్ హాట్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి వారు అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బాధిత మత్స్యకారుల కుటుంబాల అభ్యర్థన మేరకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరిపాయి. మత్స్యకారులపై నమోదైన కేసుల ఉపసంహరణకు ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేవని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేయడంతో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.

ఉత్తరాంధ్రలో నెలకొన్న ఆనందోత్సాహాలు

విడుదలవుతున్న 23 మందిలో 9 మంది విజయనగరం జిల్లాకు చెందిన వారు కాగా, మిగిలిన 14 మంది పశ్చిమ బెంగాల్ వాసులు. విజయనగరం జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన మత్స్యకారులు విడుదలవుతున్నారన్న వార్తతో వారి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. జైలు నుంచి విడుదల ఖరారు కావడంతో, మత్స్యకారులు ఇప్పటికే ఫోన్ల ద్వారా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మూడు నెలల తర్వాత తమ వారి గొంతు వినడంతో కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. విడుదల ప్రక్రియ పూర్తయ్యాక, మరో ఐదారు రోజుల్లో వీరు తమ స్వగ్రామాలకు చేరుకోనున్నారు. తమ వారు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని ఉత్తరాంధ్ర తీరప్రాంత కుటుంబాలు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాయి.

Next Story