విశాఖ | వైసీపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల అధికారి!!

by Thanuru Gopichand |

గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో 26 మంది ఫిరాయింపు కార్పొరేటర్లతో మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది.

విశాఖ | వైసీపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల అధికారి!!
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో 26 మంది ఫిరాయింపు కార్పొరేటర్లతో మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. ఫిరాయింపు కార్పొరేటర్లను అనర్హులుగా ప్రకటించాలని ఏప్రిల్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వైసీపీ ఫిర్యాదును ఎన్నికల అధికారి తిరస్కరించారు. సభ్యులు నేరుగా విప్ ధిక్కారణ నోటీసులు పొందకపోవడంతో తిరస్కరించినట్లు పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP), ఫిరాయింపుల పర్వంతో మేయర్ పీఠాన్ని కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీక చెందిన దాదాపు 26 మంది కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరారు. ఈ పరిణామంతో కార్పొరేషన్‌లో బలాబలాలు తారుమారయ్యాయి. ఫిరాయింపుదారుల అండతో మేయర్ పదవిని కూటమి తన ఖాతాలో వేసుకుంది. అయితే పార్టీ ఫిరాయించిన 26 మంది కార్పొరేటర్లపై వేటు వేయాలని, వారిని తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని వైకాపా నాయకత్వం పట్టుబడుతోంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఇప్పటికే అధికారికంగా ఫిర్యాదు చేసింది.

​వైసీపీ కార్పొరేటర్ల ఫిరాయింపులపై గత ఏప్రిల్ నెలలోనే ఆ పార్టీ నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. అయితే సుదీర్ఘ పరిశీలన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ ఫిర్యాదును తిరస్కరించడం విశేషం. విప్ ధిక్కరణకు సంబంధించి సాంకేతిక కారణాలను చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత సభ్యులు నేరుగా విప్ ధిక్కరణ నోటీసులను అందుకోలేదని, అందువల్ల వారిపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిణామం వైకాపాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అధికారుల నిర్ణయంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

​మేయర్ పదవిని కైవసం చేసుకున్న కూటమి నేతలు మాత్రం ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ప్రక్రియ అని సమర్థించుకుంటున్నారు. ఫిరాయింపుల వెనుక ఎలాంటి అక్రమాలు లేవని, స్వచ్ఛందంగానే కార్పొరేటర్లు తమతో కలిశారని వారు పేర్కొంటున్నారు. మరోవైపు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదును తిరస్కరించడంపై వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. విప్ జారీ చేసినా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా, విశాఖ కార్పొరేషన్ వేదికగా జరుగుతున్న ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Next Story