విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ధర్నా

by Thanuru Gopichand |   (  Updated:2025-12-15 07:04:40  IST  )

సీఎండీ నిర్ణయాల వల్ల తాము నష్టపోతున్నామని విశాఖ స్టీల్ ప్లాంట్ (Visaka Steel Plant) కార్మికులు ఆరోపిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎండీ నిర్ణయాల వల్ల తాము నష్టపోతున్నామని విశాఖ స్టీల్ ప్లాంట్ (Visaka Steel Plant) కార్మికులు ఆరోపిస్తున్నారు. సీఎండీ నిర్ణయాల వల్ల రెగ్యులర్ కార్మికులతో (Workers) పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని వాపోతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేస్తున్నారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సోమవారం ధర్నాకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పరిపాలన విభాగం దగ్గర ధర్నా చేపట్టారు. జీతం మా కష్టార్జితం - మా హక్కు.. ఉత్పత్తికి జీతాలకు ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్‌ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రా మెటీరియల్‌ ఇవ్వండి.. ఉత్పత్తి చేస్తామంటూ ఉక్కు కార్మికులు నినదించారు. బకాయి వేతనాలు.. పూర్తి వేతనాలు చెల్లించాలని పట్టుబట్టారు. సెయిల్‌లో విలీనంతో పాటు నిలిపివేసిన సౌకర్యాలు పునరిద్దరించాలని ఆందోళనకు దిగారు.

వివాదం వివరాల్లోకి వెళ్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల వేతనాల విషయంలో సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. కార్మికులు చేసే ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని సంస్థ ప్రకటించడాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నాణ్యమైన ముడి సరుకు సరఫరా, యంత్రాల మరమ్మతులను నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. సంస్థ వైఫల్యాలను కార్మికులకు రుద్దే ప్రయత్నం జరుగుతోందని విమర్శిస్తున్నారు. కార్మికులను కవ్వించి ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలను వ్యక్తం చేశారు. సంస్థను బలహీనపరిచి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని యత్నిస్తున్నట్లు విమర్శలు గుప్పించారు. సీఎండీ తీరును వారు తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా సీఎండీ ఏకపక్ష నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించి కార్మికులకు న్యాయం చేయాలని స్పష్టం చేస్తున్నారు.

Next Story