- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ | స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాల్లో కోత.. నిరసన
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ - RINL) యాజమాన్యం ఉద్యోగుల వేతనాల విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయం కార్మికుల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ - RINL) యాజమాన్యం ఉద్యోగుల వేతనాల విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయం కార్మికుల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్యోగుల జీతాలను ఉత్పత్తి లక్ష్యాల సాధనతో ముడిపెడుతూ యాజమాన్యం ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ కార్మికుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఆ సర్క్యులర్ ప్రకారం ఆయా విభాగాలు నిర్దేశించిన 100 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తేనే ఉద్యోగులకు పూర్తిస్థాయి జీతం అందుతుంది. ఉత్పత్తిలో ఎంత శాతం తగ్గుదల ఉంటే, వేతనంలో కూడా అంతే శాతం కోత విధించబడుతుంది. గత కొంతకాలంగా జీతాలు సక్రమంగా, పూర్తి స్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్న వేలాది మంది ఉద్యోగులకు యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. యాజమాన్యం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కార్మికులను బలిపశువులను చేస్తోందని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. నాణ్యమైన ముడి పదార్థాల సరఫరా లేకపోవడం, యంత్రాల మరమ్మతులను నిర్లక్ష్యం చేయడం వంటి యాజమాన్యం తప్పిదాల వల్లనే ఉత్పత్తి లక్ష్యాలు నెరవేరడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
యాజమాన్యం నిర్ణయానికి నిరసనగా ఆందోళన పర్వం మొదలైంది. లిక్విడ్ స్టీల్ దిమ్మలను తయారుచేసే కీలకమైన ఎస్ఎంఎస్-2 (SMS-2) విభాగానికి చెందిన ఉద్యోగులు తొలి అడుగు వేశారు. ఉత్పత్తి లక్ష్యాల ఆధారంగా జీతాలు చెల్లించాలన్న కొత్త విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వారు బుధవారం తమ ఆందోళనను ప్రారంభించారు. ఈ ఆందోళన కేవలం ఒక విభాగానికే పరిమితం కాలేదు. కార్మిక సంఘాల ఉమ్మడి పిలుపు మేరకు, నేడు (బుధవారం) ప్లాంట్‌లోని అన్ని విభాగాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం కార్మికులపై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేయడంతో, ప్లాంట్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వేతన కోత ఉద్యమం విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై, కార్మికుల భద్రతపై మరింత అపనమ్మకాన్ని పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






