విశాఖ | శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ

by Thanuru Gopichand |

విశాఖపట్నంలోని (Visakapatnam) బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి (Sri Kanaka Mahalaxmi Temple) భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

విశాఖ | శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలోని (Visakapatnam) బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి (Sri Kanaka Mahalaxmi Temple) భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే దేవాలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతోంది. పవిత్రమైన మార్గశిర మాసోత్సవాలు, రెండో శనివారం ఒకే రోజు రావడంతో దేవాలయానికి భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు చేరుకొంటున్నారు. క్యూ లైన్లలో నిలుచొని అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ప్రత్యేకించి మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కారణంగా విశాఖపట్నం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతున్నాయి.

​భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. సాధారణ దర్శనం లైన్లతో పాటు, ప్రత్యేక దర్శనం కోసం కూడా ఏర్పాట్లు చేశారు. భక్తులు త్వరగా, సులభంగా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఆలయం చుట్టుపక్కల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆలయానికి వచ్చే, వెళ్లే వాహనాలను క్రమబద్ధీకరించడం ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం సిబ్బంది, పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. మార్గశిర మాసం ముగిసే వరకు ఆలయంలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story