Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు థీమ్‌తో విశాఖ ఉత్సవ్‌.. ఎప్పుడంటే?

by Ramesh Naini |

సాగరం నుంచి శిఖరం వరకు అనే ఆకర్షణీయమైన థీమ్‌తో ఈ ఏడాది ‘విశాఖ ఉత్సవ్‌’ను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు థీమ్‌తో విశాఖ ఉత్సవ్‌.. ఎప్పుడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాగరం నుంచి శిఖరం వరకు అనే ఆకర్షణీయమైన థీమ్‌తో ఈ ఏడాది ‘విశాఖ ఉత్సవ్‌’ను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నం కేంద్రంగా జరిగే ఈ ఉత్సవాలు విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల వ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఇవాళ విశాఖ ఉత్సవ్‌ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్‌, అనిత, సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర పాల్గొని వివరాలు వెల్లడించారు.

మూడు జిల్లాల్లో 20 వేదికలు

మూడు జిల్లాల్లోని 20 వేదికల్లో 500కు పైగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. శాస్త్రీయ నృత్యాలు, అరకు ధింసా నృత్యం, అనకాపల్లి జానపద కళలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నగరంలోని ఆర్కే బీచ్‌తో పాటు సాగర్‌నగర్‌, రుషికొండ, మంగమారిపేట, భీమిలీ బీచ్‌లలో జనవరి 24 నుంచి 27 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. అనకాపల్లి జిల్లాలో ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్సవాలు జరగనుండగా, అరకులో జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లవర్ షో, మిస్ వైజాగ్‌, మిస్టర్ వైజాగ్‌, వైజాగ్ కల్చర్ టాలెంట్స్‌, రాష్ట్ర సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటం వంటి కార్యక్రమాలతో పాటు ఫుడ్ కోర్టులు, షాపింగ్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.

డ్రోన్ షో, బీచ్ గేమ్స్, రెస్టారెంట్లు మరెన్నో..

డ్రోన్ షో, బీచ్ గేమ్స్, బీచ్ రెస్టారెంట్లు, అడ్వంచర్ స్పోర్ట్స్, బోటు రేసింగ్, స్పీడ్ బోటింగ్, కయాకింగ్, పారామోటరింగ్, కార్నివాల్ వాక్‌, టెంపుల్ రెప్లిక, వంటల పోటీలు వంటి వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో సైక్లింగ్ పోటీలు, ఫ్లోరికల్చర్, అమ్యూజ్‌మెంట్ రైడ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టాళ్లు, కాఫీ ఫెస్టివల్‌ ప్రత్యేకంగా ఉంటాయి. అరకువ్యాలీలో ట్రైబల్ పెర్ఫార్మెన్సులు, అనంతగిరి-గాలికొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌, పారాగ్లైడింగ్‌, హాట్ ఎయిర్ బెలూన్‌, పారా మోటరింగ్ వంటి సాహస క్రీడలకు ఏర్పాట్లు చేస్తున్నారు. టాలీవుడ్‌ నటుల ప్రదర్శనలు కూడా సందడి చేయనున్నాయి. ఈ ఉత్సవాల ద్వారా రూ. 500 కోట్ల ఆర్థికాభివృద్ధి, 3,000 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశాఖలో ప్రారంభమయ్యే ఉత్సవాలు అనకాపల్లిలో ముగింపు వేడుకలతో ముగియనున్నాయి.

Next Story