- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచి విశాఖ ఉత్సవ్ : Sea to Sky
సంబరాలకు సిద్ధమైన సాగర తీరం.. ఉత్తరాంధ్ర ప్రాంతం.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్రలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. వాటిని అమలుపరుస్తోంది. అందులో భాగంగా విశాఖ వేదికగా ఉత్తరాంధ్ర పర్యాటక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే మహా వేడుకకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖ ఉత్సవ్ (Visaka Utsav) రేపటి నుంచి ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బీచ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 1వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు విశాఖవాసులతో పాటు పర్యాటకులను, సందర్శకులను కనువిందు చేయనుంది.
సరికొత్త కాన్సెప్ట్
ఈ ఏడాది ఉత్సవాలను సీ టు స్కై (Sea to Sky) అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నారు. సముద్ర తీర అందాల నుంచి అరకు గిరి శిఖరాల వరకు ఈ వేడుకల్లో భాగం కానున్నాయి. కేవలం విశాఖ నగరానికే పరిమితం కాకుండా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు (Araku) జిల్లాలను కలుపుతూ 20 ప్రధాన వేదికలపై 500కు పైగా కార్యక్రమాల నిర్వహణకు పర్యాటక శాఖ ప్రణాళికలను రూపొందించింది.
ప్రధాన ఆకర్షణగా
పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. పర్యాటకులను అలరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. సాహస క్రీడను ఇష్టపడేవారి కోసం రుషికొండ తీరంలో స్కూబా డైవింగ్, హెలికాప్టర్ రైడ్స్, పారామోటార్ రైడ్స్ వంటివి ఏర్పాటు చేశారు. సాహిత్య ప్రేమికులను ఆకట్టుకునేందుకు 650 మందికి పైగా కళాకారులతో కూడిన జానపద, గిరిజన నృత్యాలు (Thimsa), జాతీయ స్థాయి సినీ నటులు, సంగీత దర్శకులతో మ్యూజిక్ కాన్సర్టులు ప్రతి సాయంత్రం జరపనున్నారు. ఆర్కే బీచ్ వేదికగా జరగనున్న అద్భుతమైన డ్రోన్ షోలు, ఆకాశంలో రంగులు చిమ్మే బాణాసంచా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర వంటకాలతో పాటు అరకు కాఫీ సందర్శకుల మదిని దోచుకోవడం ఖాయం అంటున్నారు.
ఆర్థిక పురోగతి - ఉపాధి కల్పన
ఈ ఉత్సవం ద్వారా దాదాపు 10 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా సుమారు రూ. 500 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హోటల్, రవాణా, ఆహార రంగాల్లో సుమారు 3,000 మంది యువతకు, స్థానిక కళాకారులకు ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. తద్వారా ఆర్థిక పురోగతితో పాటు ఉపాధి కల్పనకు ఆస్కారం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏ రోజూ ఎక్కడ అంటే
విశాఖ ఉత్సవ్ వేడుకలను మూడు విభాగాలుగా విభజించినట్లు అధికారులు తెలిపారు. జనవరి 24న ఉత్సవాలు విశాఖ వేదికగా ప్రారంభమవుతాయన్నారు. జనవరి 31 వరకు బీచ్ యాక్టివిటీస్ కొనసాగుతాయని వెల్లడించారు. అదే విధంగా అనకాపల్లిలో జనవరి 29, 30 తేదీల్లో ధ్యానం, వారసత్వ వేడుకల నిర్వహణతో పాటు ముగింపు సభను జరుపుతారన్నారు. జనవరి 30, ఫిబ్రవరి 1 తేదీల్లో గిరిజన సంస్కృతి, నేచర్ వాక్స్ వంటివి నిర్వహిస్తారని తెలిపారు.
పటిష్ట భద్రత ఏర్పాట్లు
పర్యాటకుల భద్రత దృష్ట్యా పోలీస్, మున్సిపల్ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో లైఫ్ గార్డ్స్, నిరంతర నిఘా కోసం ప్రత్యేక బృందాలను అధికారులు రంగంలోకి దించారు. ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్‌ను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టే ఈ వేడుకను జయప్రదం చేయాలని ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది.






