Vijayawada | ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం

by Thanuru Gopichand |

ఇంద్రకీలాద్రికి భక్తజనులు వేలాదిగా తరలివస్తున్నారు. భవానీ దీక్షధారులు దీక్షా విరమణ కోసం కొండకు చేరుకుంటున్నారు.

Vijayawada | ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంద్రకీలాద్రికి భక్తజనులు వేలాదిగా తరలివస్తున్నారు. భవానీ దీక్షధారులు దీక్షా విరమణ కోసం కొండకు చేరుకుంటున్నారు. జై భవాని.. బెజవాడ కనకదుర్గమ్మకి (Bejwada Kanaka Durga) జై అంటూ విజయవాడ పరిసరాలను ఆధ్యాత్మిక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. డిసెంబర్ 11న ప్రారంభమైన భవానీ దీక్షధారణ నేటితో ముగియనున్న నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, పక్క రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఇరుముడులు సమర్పించి.. దీక్ష విరమించిన అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దీక్షల చివరి రోజు కావడం వారాంతపు సెలవు ముగియడంతో భక్తుల రద్దీ ఆదివారం కంటే మరింత పెరిగిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 1.50 లక్షల మందికి పైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఐదు రోజుల మహోత్సవంలో దాదాపు 6 లక్షల మందికి పైగా భక్తులు దీక్షలను విరమించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

మహాపూర్ణాహుతితో ముగింపు

​భవానీ దీక్షల విరమణ మహోత్సవాలకు నేటితో మహాపూర్ణాహుతితో తెరపడనుంది. ఉదయం 10.30 గంటలకు ఆలయ యాగశాలలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంతో ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కొనసాగిన ఈ మహోత్సవం పరిసమాప్తం అవుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భవానీలకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు.

వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు

​భవానీ మాలధారుల దీక్ష విరమణ నేపథ్యంలో ఉన్న రద్దీ దృష్ట్యా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం పాలకమండలి నేడు కూడా వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేసింది. ముఖ్యంగా చివరి రెండు రోజులు రద్దీ ఎక్కువగా ఉంటుందనే అంచనాతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భవానీలు దీక్ష విరమించి, తమ ఇరుముడులను సమర్పించి, అమ్మవారిని సులువుగా దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు, వసతి సౌకర్యాలు, అన్నప్రసాద వితరణ వంటివి ఏర్పాటు చేశారు. ఈ వేడుకను విజయవంతం చేయడానికి ఆలయ సిబ్బందితో పాటు పోలీసు శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు.

Next Story