ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ఏ49 అనిల్ చోఖ్రాకు రిమాండ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-15 10:47:59  IST  )

గత ప్రభుత్వ హయాంలో సంచలం రేపిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ఏ49 అనిల్ చోఖ్రాకు రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో సంచలం రేపిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. ఈ కేసులో ఏ49గా ఉన్న అనిల్ చోఖ్రాను అరెస్ట్ చేసి.. విజయవాడ కోర్టులో పరిచింది. రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలను పరిశీలించిన కోర్టు.. ఈనెల 21వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. దీంతో అనిల్ చోఖ్రాను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన అనిల్ చోఖ్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి మద్యం మడుపుల డబ్బును బదిలీ చేశాడు. ఆపై ఆ డబ్బును సిండికేట్ సభ్యులకు చేర్చినట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏ1 రాజ్ కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డిల నుంచి వసూలు చేసిన రూ.77.55 కోట్లను ముంబైలో నాలుగు షెల్ కంపెనీలకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు సిట్ గుర్తించింది. అదానీ డిస్టిల్లరీస్ నుంచి రూ.18 కోట్లు, లీలా డిస్టిల్లరీస్ నుంచి రూ.20 కోట్లు, స్పై ఆగ్రో నుంచి రూ.39 కోట్లు.. మొత్తం రూ.77 కోట్లను నాలుగు షెల్ కంపెనీలకు బదిలీ చేశాడు. అక్కడి నుంచి ఆ డబ్బు మరో 32 షెల్ కంపెనీలకు బదిలీ అయింది. షెల్ కంపెనీల్లో జరిగిన ఈ అక్రమ లావాదేవీలను గుర్తించేందుకు ముంబైలో పలుమార్లు దర్యాప్తు చేసిన సిట్.. ఈ ఏడాది మార్చి 10వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకూ జరిపిన విచారణలో 25 షెల్ కంపెనీలను అడ్రస్ లతో సహా గుర్తించింది.

బినామీ డైరెక్టర్లు, ప్రొఫెషనల్ ఫెసిలిటేటర్ల ద్వారా షెల్ కంపెనీలను నిర్వహించాడు. బ్లాక్ మనీని వైట్ గా మార్చి.. షెల్ కంపెనీ ద్వారా ఆ డబ్బును వాడటంలో అనిల్ చోఖ్రా కీలకంగా పనిచేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. షెల్ కంపెనీలు, లీలా డిస్టిల్లరీస్ కు జారీ చేసిన 114 ఇన్ వాయిస్, ఈవే బిల్లులను సీజ్ చేశామని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే కృపతి మల్టీ వెంచర్స్, ఓల్విక్ మల్టీ వెంచర్స్ జారీ చేసిన ఇన్ వాయిస్ లలో రూ.200 కోట్లకు పైగా నకిలీవిగా గుర్తించామన్నారు.

Next Story