- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేషన్, మైనింగ్ మాఫియాకు అండగా విజిలెన్స్?
రేషన్, మైనింగ్ మాఫియాలతో విజిలెన్స్ కుమ్మక్కైందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కీలకమైన విజిలెన్స్ శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం..ఆస్తుల పరిరక్షణపై కన్నేసి కట్టడికి చర్యలు చేపట్టాల్సిన ఈ విభాగం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినబడుతున్నాయి. జిల్లాలవారీగా అక్రమార్కులతో, ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు జతకట్టి అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
ఠంచనుగా నెలవారీ మామూళ్లు..
ప్రధానంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టించడం, మైనింగ్, ఇసుక మాఫియాకు పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. రూ.లక్షల్లో నెలవారీ మామూళ్లు అందుతుండటంతో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు వచ్చేందుకు డీఎస్సీ, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు క్యూ కడుతున్నారు. అవసరమైతే ప్రజా ప్రతినిధులతో సిఫారసు లేఖలు తీసుకొని మరీ వచ్చి ఇక్కడ తిష్టవేస్తున్నారు. ఎస్ఐ, అంతకంటే దిగువస్థాయి ఉద్యోగులైతే అసలు ఇక్కడి నుంచి వెళ్లేందుకే ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్పై వచ్చే అధికారులు, సిబ్బంది కూడా ఒత్తిడి లేని విధులు..నెలవారీ ఠంచనుగా అందే మామూళ్లతో కులాసాగా గడుపొచ్చని భావిస్తున్నారు. ఒకప్పుడు విజిలెన్స్ అంటేనే బెంబేలెత్తిన అక్రమార్కులు.. ఇప్పుడు నేరుగా అధికారులతోనే సత్సంబంధాలు నెరుపుతూ తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు.
రేషన్ మాఫియాతో చెట్టాపట్టాల్..
ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెస్తున్న రేషన్ మాఫియాతో విజిలెన్స్ అధికారులు అంటకాగుతున్నారు. వాస్తవానికి పలు జిల్లాల్లో రేషన్ మాఫియా సిండికేట్లను వీరే తయారు చేస్తున్నట్లు విమర్శలు వినబడుతున్నాయి. రేషన్ మాఫియాల మధ్య విబేధాలను పరిష్కరిస్తూ..వీరికి ప్రాంతాలను కేటాయించి గొడవలు జరగకుండా వీరే సర్థుబాటు చేస్తున్నట్లు అనేక ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా మినహా మెజారిటీ అధికారులు, సిబ్బంది వీరి అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. ఎక్కడైనా రేషన్ మాఫియా సరుకు ఆగినట్లు తెలిస్తే వెంటనే వీరు వెళ్లి తనిఖీల పేరిట రేషన్ సరుకులను సైడ్ చేస్తున్నారు. జిల్లాలు, రాష్ర్ట సరిహద్దుల దాటేవరకు సంబంధిత జిల్లాల అధికారులే పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా రేషన్ మాఫియాకు అడ్డుకట్ట పడకపోవడానికి వీరి సహకారమే నిదర్శనమని స్పష్టమవుతోంది.
కూటమి ప్రభుత్వం కట్టుదిట్టం చేసినా..
గత ప్రభుత్వంలో కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలుమార్లు కాకినాడ పోర్టును సందర్శించి గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి రేషన్ అక్రమ తరలింపుకు అడ్డుకట్ట వేశారు. ఇక్కడ ప్రభుత్వం టైట్ చేయడంతో నెల్లూరు, చెన్నై పోర్టులకు రేషన్ బియ్యం తరలిపోతున్నాయి. మరికొన్ని తెలంగాణ రాష్ర్టంలోని కొందరు వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ కనుసన్నల్లోనే జరుగుతాయనేది బహిరంగ రహస్యమే. ఇందుకోసం ఆయా జిల్లాల్లోని రేషన్ మాఫియా నుంచి రూ.లక్షల్లో నెలవారీ మామూళ్లు వీరికి అందుతాయన్నది బహిరంగ రహస్యమే.
అక్రమ మైనింగ్‌కు సహకారం..
పలు జిల్లాల్లో అనేక చోట్ల అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ కనీసం కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఉంది. ఎవరైనా సమాచారం ఇచ్చినా రెవెన్యూ అధికారుల పని తప్ప తమది కాదంటూ తప్పించుకుంటారే కాని స్పందించడం లేదనే విమర్శలు విజిలెన్స్ అధికారులపై ఎప్పటి నుంచో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ రంగాలను ప్రోత్సహించేందుకు ఉచిత ఇసుక విధానం అమలులోకి తెచ్చింది. కేవలం దూరాన్ని బట్టి ట్రాన్స్‌పోర్టు చార్జీలు చెల్లించడం మినహా వినియోగదారులు ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే అనేక ఇసుక ర్యాంపులు, క్వారీల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు ఇటీవల కాలంలో ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక్కడి నుంచి కొందరు బడాబాబులు ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసినప్పిటీక.. విజిలెన్స్ అధికారుల్లో మాత్రం చలనం లేదని చెప్పొచ్చు.
లూప్ లైన్ కాదిది.. ‘లాభసాటి’ లైన్!
పోలీసు శాఖలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోస్టింగ్ అంటే లూప్ లైన్‌గా పరిగణిస్తారు. వేర్వేరు ఆరోపణలు వచ్చినప్పుడు పనిష్‌మెంట్‌గా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు బదిలీ చేస్తారు. అయితే పదోన్నతి పొందినప్పుడు లూప్‌లైన్‌లో రెండేళ్ల పాటు చేయాలనే నిబంధన కూడా ఉంది. అందుకే పదోన్నతి పొందిన అధికారులను విజిలెన్స్, ఇంటెలిజెన్స్ వంటి విభాగాలకు పంపుతారు. ఒకప్పుడు విజిలెన్స్‌కు వెళ్లడమంటే అధికారులు అంతగా ఇష్టపడే వారు కాదు. ఏదో ఒకలా మేనేజ్ చేసుకొని బయటపడే వారు. గత ఆరేడేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్ట్రీమ్ లైన్ పోస్టింగ్‌లో ఉండే రిస్క్ లేకపోవడం.. జీతం కంటే గీతం కూడా ఎక్కువగానే వస్తుండటంతో భారీ డిమాండ్ నెలకొంది. ఇక్కడి వచ్చేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. అవసరమైతే ఆమ్యామ్యాలు ఇచ్చేందుకు.. పొలిటికల్ పవర్ వాడేందుకు సైతం వెనుకాడటం లేదు.






