నెట్లో వీడియో వైరల్.. పోలీసులకు సింహాచలం AEO ఫిర్యాదు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-31 06:44:42  IST  )

Viral Videoతో సింహాచలం పులిహోర ప్రసాదం చుట్టూ వివాదం.

నెట్లో వీడియో వైరల్.. పోలీసులకు సింహాచలం AEO ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్ : సింహాచలం (Simhachalam) ప్రసాదంలో నత్త వచ్చిందని ఓ ఇద్దరు వ్యక్తులు వీడియో చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో (Viral Video) తీవ్ర దుమారం రేగింది. ప్రసాదం నాణ్యతపై నెటిజన్ల నుంచి ప్రశ్నాల వర్షం కురిసింది. అందులోనూ సింహాచలంలో ప్రసాదం కొనేముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని సదరు వ్యక్తులు వీక్షకులకు విన్నవించడం మరింత వివాదానికి కారణమైంది. తాము కొనుగోలు చేసిన పులిహోరలో నత్తగుల్ల వచ్చిందంటూ వారు చేసిన ఆరోపణలు భక్తుల్లో కలకలం రేపాయి. నష్ట నివారణ చర్యల్లో భాగంగా సింహాచలం దేవస్థానం అధికారులు సత్వరమే స్పందించారు. సెల్ఫీ వీడియో చేసి వైరల్ చేసి వ్యక్తులపై గోపాలపట్నం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు.

దేవస్థానం ఏఈఓ రమణమూర్తి (AEO Ramanamurthy) సింహాచలం పోలీసు స్టేషనుకు బుధవారం వెళ్లారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఓ జంట సింహాచలం దేవస్థానం పులిహోర ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తుందని అధికారి పేర్కొన్నారు. దురుద్దేశపూరితంగా వారు ఆరోపణలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవస్థానం ప్రతిష్ఠను మంటగలిపేలా వారు వ్యవహరించారని ఆరోపించారు. వారి ప్రవర్తన కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. పులిహోర తయారీ మూడు దశల్లో జరుగుతుందన్నారు. రోజుకు సుమారు ఇరవై వేల ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయిస్తామన్నారు. గత ముప్పై ఒక్క ఏళ్లలో ఇటువంటి ఘటన జరగలేదన్నారు. కాబట్టి పులిహోర ప్రసాదంలో నత్త రావడం అసాధ్యమని స్పష్టం చేశారు. కావాలనే నత్తను పెట్టారనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఏఈఓ ఫిర్యాదు మేరకు వీడియోలో ఉన్న జంటపై బీఎన్ఎస్ 298, 353(1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story