విశాఖకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. ఘన స్వాగతం పలికిన గవర్నర్, స్పీకర్

by Ramesh Naini |

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభమైంది.

విశాఖకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. ఘన స్వాగతం పలికిన గవర్నర్, స్పీకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభమైంది. సోమవారం విశాఖ చేరుకున్న ఆయనకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సాదర స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయన శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు ఆధ్యాత్మిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం విశాఖలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఉపరాష్ట్రపతికి లాంఛనంగా స్వాగతం పలుకనున్నారు.

శ్రీకాకుళంలో ఆధ్యాత్మిక పర్యటన

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తన పర్యటనలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామి ఆలయాన్ని, అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనను ముగించుకుని మధ్యాహ్నం తిరిగి విశాఖ బయల్దేరుతారు. ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అధికార యంత్రాంగం జిల్లాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.

ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో వీపీ, సీఎం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు, రేపు విశాఖలో విస్తృతంగా పర్యటించనున్నారు. శ్రీకాకుళం నుంచి ఉపరాష్ట్రపతి తిరిగి విశాఖ చేరుకున్న అనంతరం, ఆయనతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రికి సీఎం, మంత్రి ఇద్దరూ విశాఖలోనే బస చేస్తారు.

రేపు గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

ముఖ్యమంత్రి విశాఖ పర్యటనలో రెండో రోజు కీలక ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర ఐటీ రంగ ముఖచిత్రాన్ని మార్చే ప్రతిష్టాత్మక ‘గూగుల్ డేటా సెంటర్’కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, రేపు జరగనున్న ‘భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్’ (Bharat AI Shakti Conclave) లో మంత్రి నారా లోకేశ్ పాల్గొననున్నారు.

Next Story